News

బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలోనే ఉంది.. భారతీయ శైలిలోకి మార్చాలి: కంగనా రనౌత్

26views

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్ వ్యవస్థలో ఇప్పటికీ బ్రిటిష్ వలస పాలన ప్రభావం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నర్సుల యూనిఫాం ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి నమూనాలను అనుసరిస్తోందని, వాటిని భారతీయ సంస్కృతి, అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

తన రాబోయే చిత్రం భారత్ భాగ్య విధాత ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కంగనా, నర్సుల యూనిఫాం అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా దుస్తులు ధరించే స్వేచ్ఛ కలిగి ఉంటే, నర్సులు మాత్రం ఎండైనా, చలైనా ఒకే రకమైన యూనిఫాం ధరించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

“ప్రస్తుతం నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది. యూనిఫాంపై టోపీ, పిన్ను, బెల్టు వంటి అంశాలు అమెరికా నేవీ, ప్రపంచ యుద్ధాల కాలం నాటి శైలిని గుర్తు చేస్తాయి. భారతీయ నర్సులకు తగిన విధంగా ఈ యూనిఫాంలో మార్పులు రావాలి” అని కంగనా అన్నారు.

నర్సుల యూనిఫాం విషయంలో ఇంకా కొనసాగుతున్న వలసవాద ప్రభావం కారణంగా వారిని కొన్నిసార్లు లైంగిక కోణంలో చూసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. యూనిఫాం రూపకల్పనలో మార్పులు చేయాలంటే నర్సుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

నర్సింగ్ వృత్తి అత్యంత సేవాభావంతో కూడుకున్నదని పేర్కొన్న కంగనా, కేవలం యూనిఫాం మాత్రమే కాకుండా వేతన విధానం, పని పరిస్థితులు వంటి అంశాల్లోనూ సంస్కరణలు అవసరమని చెప్పారు. తన సినిమా ఆ దిశగా సమాజంలో చర్చకు దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, కంగనా ప్రస్తుతం నర్సెస్ ఆఫ్ కామా చిత్రంలో నర్సు పాత్రలో నటిస్తున్నారు. 2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రవాద దాడులు సమయంలో లక్ష్యంగా మారిన కామా ఆసుపత్రి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్‌లో, ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన నర్సుల సేవలను ప్రధానంగా చూపించనున్నారు.