
విజయనగరం జిల్లాలో జరిగే పైడితల్లి, శంబర పోలమాంబ ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందాయి. ఉమ్మడి జిల్లాతో పాటు విశాఖ, శ్రీకాకుళం, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఏటా జరిగే సిరిమానోత్సవాలకు లక్షల్లో బయలుదేరుతారు. కానీ ఆమేరకు సౌకర్యాలు ఉండడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు ఆలయాలు ఇరుకు వీధుల్లోనే ఉండడం గమనార్హం. విస్తరణకు చర్యలు చేపట్టినా.. పనులు మాత్రం ఊపందుకోని పరిస్థితి.
నగరంలో పరిస్థితి ఇదీ..
నగరంలోని మూడులాంతర్లు సమీపంలో ఉన్న పైడితల్లి ఆలయ విస్తరణ మాటల్లోనే కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల కిందట తెదేపా హయాంలో చదురుగుడి అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా గుడికి ఎదురుగా ఉన్న 58 సెంట్ల ఖాళీ స్థలాన్ని పురపాలక సంఘం నుంచి దేవాదాయశాఖ రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం స్థానిక దుకాణదారులు అడ్డుకోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. ఎట్టకేలకు 2022లో దుకాణాల తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఇంకా పనులు సాగుతున్నాయి. ఆ తరువాతే మాస్టర్ ప్లాన్ అమలు కానుంది.
అభివృద్ధి ఇంకెప్పుడో?
గిరిజన ప్రజల ఆరాధ్య దైవంగా కీర్తికెక్కిన పోలమాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి అడుగులు పడడం లేదు. ఇక్కడ ఏటా జరిగే సిరిమానోత్సవం అనంతరం పదివారాల పాటు వేల సంఖ్యలో భక్తులు వనంగుడి, చదురుగుడి ఆలయాలను దర్శించి, మొక్కులు చెల్లించుకుంటారు. ఏడాది పొడువునా పూజలు సాగుతాయి. ప్రస్తుతం చదురుగుడి ఆలయం ఇళ్ల మధ్యే ఉంది. దీంతో అవస్థలు తప్పడం లేదు. విస్తరణకు ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం దక్కని దుస్థితి. విస్తరణ, విశ్రాంతి షెడ్లు, రక్షణ గోడ, శాశ్వత క్యూలైన్లు, పార్కు తదితరాల ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. కానీ రూపుదాల్చడం లేదు. ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, ఈమేరకు రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు ఈవో వీవీ.సూర్యనారాయణ తెలిపారు. త్వరలోనే పనులు చేస్తామన్నారు.
రూ.15 కోట్ల ఖర్చు..
విస్తరణలో భాగంగా ఆలయ సముదాయంలోనే దేవస్థాన కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే అన్నదానం, హోమ మండపం, కల్యాణ మండపం, ప్రసాదాలు, టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. భక్తుల ఇబ్బంది దృష్ట్యా క్యూ లైన్లు కూడా అందులోనే పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు దాదాపు రూ.15 కోట్ల వరకు ఖర్చవుతుందని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని దేవస్థానం ఏసీ ప్రసాదరావు తెలిపారు.





