పర్యావరణ పరిరక్షణకోసం కొందరు మాత్రం దశాబ్దాల పాటు ప్రకృతి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రభునాథ్ షాహీ ఒకరు. రిటైర్మెంట్ అనంతరం విశ్రాంతి జీవితాన్ని గడపకుండా, పచ్చదనం పెంపుదలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రైసిటీ ప్రాంతంలో అనేక వనవాటికలను అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.
ప్రకృతి ప్రేమతో మొదలైన ప్రయాణం
బిహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన ప్రభునాథ్ ప్రస్తుతం చండీగఢ్‌లో నివసిస్తున్నారు. తొలుత భారత వైమానిక దళంలో సేవలందించారు. అయితే గుండె సంబంధిత సమస్యల కారణంగా ముందుగానే పదవీ విరమణ పొందాల్సి వచ్చింది. అనంతరం చండీగఢ్ అటవీ శాఖలో ఉద్యోగం చేపట్టారు. బాల్యంలోనే ప్రకృతిపట్ల ఆసక్తి పెరిగిందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మమ్మ వాళ్ల వద్ద పెరిగిన సమయంలో చెట్లు, మొక్కలతో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. ఉద్యోగ జీవితంలోనూ ప్రకృతి పరిరక్షణకు సమయం కేటాయించేవారని, కానీ రిటైర్మెంట్ తర్వాత పూర్తిస్థాయిలో అదే పనికి అంకితమయ్యానని పేర్కొన్నారు. అటవీ శాఖలో పనిచేసిన అనుభవంతో ఎక్కడ వనవాటికలు అభివృద్ధి చేయొచ్చు, ఎలాంటి అనుమతులు అవసరమో తెలుసుకోవడం తనకు సులభమైందని వివరించారు.
చెత్త కుప్పల నుంచి పచ్చని తోటల వరకు
ఛండీగఢ్-పంచ్‌కులా సరిహద్దులోని సెక్టార్-56 ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి మొదటి వనవాటికను ఏర్పాటు చేసినట్లు ప్రభునాథ్ తెలిపారు. ప్రారంభంలో స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగినట్లు చెప్పారు. చెత్తతో నిండిపోయిన ప్రదేశాలను శుభ్రపరచి అక్కడ విత్తనాలు చల్లి, పండ్ల చెట్లు, పుష్ప మొక్కలు, నీడనిచ్చే వృక్షాలను నాటారు. ఉసిరి, వేప, బహెడా, ఆడూ, మునగ వంటి అనేక రకాల మొక్కలను పెంచారు. కొన్నేళ్ల క్రితం నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ట్రైసిటీలో 25 వనవాటికలు
ప్రభునాథ్ ఇప్పటివరకు చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీతో పాటు వివిధ సెక్టార్లు, ట్రైసిటీ పరిధిలో సుమారు 25 వనవాటికలను అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతాల్లో అనేక చోట్ల ఒకప్పుడు చెత్త, మురుగు పేరుకుపోయి ఉండేదని, ఇప్పుడు అక్కడ పండ్ల చెట్లు, పూల మొక్కలు, భారీ నీడనిచ్చే వృక్షాలు పెరిగి పర్యావరణాన్ని మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 10 వేలకుపైగా మొక్కలను నాటి, వాటి సంరక్షణను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
తోటల సంరక్షణకు ప్రత్యేక సిబ్బంది
వనవాటికల సంరక్షణ కోసం తోటమాలీలతో పాటు భద్రతా సిబ్బందిని కూడా నియమించినట్లు ప్రభునాథ్ తెలిపారు. వారికి నెలవారీ వేతనాలు చెల్లిస్తూ తోటల నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా మొక్కల సంరక్షణలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, అది నిరంతర ప్రక్రియ అని ప్రభునాథ్ షాహీ అన్నారు. మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని, ప్రకృతి సంరక్షణ కోసం తన వంతు బాధ్యతను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.




