NewsSeva

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ ను సందర్శించిన ఆరెస్సెస్ అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్

945views

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అభ్యంకర్ నెల్లూరులోని జయభారత్ ఆసుపత్రిని సందర్శించారు. 18. 07. 2019 గురువారం నాడు నెల్లూరుకు విచ్చేసిన శ్రీ అభ్యంకర్ కు ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రిలోని  అన్ని విభాగాలను చూపించారు. ఆసుపత్రిలోని దంత, నేత్ర, పసిపిల్లల విభాగాలతోపాటు, ఆర్థో పెడిక్ , ఫిజియో థెరపి విభాగము మరియు ఐ సి యు తదితరాలను ఆయన సందర్శించారు. ఇటీవలే ప్రారంభమైన డయాలసిస్ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. అన్ని విషయాలను వివరంగా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన హాస్పిటల్ కమిటీ వారితో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణలో జరిగే ఏ చిన్న పొరపాటు వల్లనైనా రోగులకు ప్రాణ నష్టం కానీ, తీవ్రమైన అనారోగ్యానికి దారి తీయడానికి గానీ అవకాశముంది కనుక ఆసుపత్రిలో ఏమరపాటుకు తావులేని విధంగా అత్యంత శ్రద్ధాసక్తులతో రోగులకు సేవ చెయ్యాల్సిన అవసరం ఉందని వివరించారు. రోగుల సేవ అంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వర సేవేనని, కనుక అత్యంత శ్రద్ధా  భక్తులతో రోగులను సేవించడమే మన కర్తవ్యమని ఉద్బోధించారు.

ఈ సమావేశంలో సింహపురి వైద్య సేవా సమితి అధ్యక్షులు శ్రీ పొన్నలూరి సీతారామి రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, సభ్యులు శ్రీ గుఱ్ఱం సుధాకర్, సలహామండలి సభ్యులు డాక్టర్ సీవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అభ్యంకర్ ఆసుపత్రిలో అమలవుతున్న పారిశుధ్యాన్ని, ఆసుపత్రి నిర్వహణను ప్రశంసించారు.  శ్రీ అభ్యంకర్  తమకు ఆసుపత్రి నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితరాలపై విలువైన సూచనలు అందించారని ఆసుపత్రి మేనేజర్ శ్రీ గురుప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.