
ఐఎంఏ జ్యువెలర్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త మన్సూర్ ఆలీ ఖాన్ అలియాస్ మన్సూర్ ఖాన్ ను శుక్రవారం వేకువ జామున ఢిల్లీలో అరెస్టు చేశారు. రూ. 4 వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసులో 60, 000 కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్సూర్ ఖాన్ ను ఈడీ, ప్రత్యేక బృందం (ఎస్ఐటీ) అధికారులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మన్సూర్ ఖాన్ అరెస్టుతో మరి కొంతమంది రాజకీయ నాయకుల, బడా నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

బెంగళూరు నగరంతో పాటు అనేక రాష్ట్రాలు, దేశ విదేశాల్లో వేలాది మందిని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్సూర్ ఖాన్ చాకచక్యంగా దుబాయ్ పారిపోయాడు. మన్సూర్ ఖాన్ దుబాయ్ లో ఉన్నాడని గుర్తించిన ఈడీ, ఎస్ఐటీ అధికారులు అతని కోసం బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. దుబాయ్ చికిత్స కోసం డబ్బు మొత్తం ఖాళీ కావడంతో అతను చికిత్స చేసుకోవడానికి ఢిల్లీకి వచ్చాడు.
దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాడని పక్కా సమాచారం రావడంతో ఈడీ, ఎస్ఐటీ అధికారులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మకాం వేశారు. విమానం దిగగానే మన్సూర్ ఖాన్ ను ఈడీ, ఎస్ఐటీ అధికారులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం ఓ వీడియో విడుదల చేసిన మన్సూర్ ఖాన్ తాను 24 గంటల్లో భారత్ వస్తానని చెప్పాడు. అయితే మన్సూర్ ఖాన్ గురువారం కాకుండా శుక్రవారం ఢిల్లీ రావడంతో అధికారులు అతన్ని అరెస్టు చేశారు.
మన్సూర్ ఖాన్ దుబాయ్ నుంచి విడుదల చేసిన వీడియోలో తాను అనేక మంది ప్రముఖులకు అనేక కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చానని ఆరోపించాడు. మాజీ మంత్రి, బెంగళూరులోని శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, బెంగళూరు జిల్లా అధికారితో సహా అనేక మంది పేర్లు చెప్పాడు. ఇప్పటికే బెంగళూరు జిల్లా అధికారిని అరెస్టు చేసిన అధికారులు ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను కూడా విచారిస్తున్నారు. మన్సూర్ ఖాన్ అరెస్టుతో మరి కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ స్కాం కేసును ఎస్ఐటీ అధికారులకు అప్పగించారు. ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. మన్సూర్ ఖాన్ కు చెందిన అనేక ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. మన్సూర్ ఖాన్ కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే మన్సూర్ ఖాన్ దుబాయ్ కి పారిపోయాడు. ఢిల్లీలో మన్సూర్ ఖాన్ ను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈడీ అధికారుల విచారణ పూర్తి అయిన తరువాత మన్సూర్ ఖాన్ ను బెంగళూరు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.





