News

తీర ప్రాంత సంరక్షణ మత్స్యకారులందరి బాధ్యత – శ్రీ పుట్టా శేషు

873views

నీతి, నిజాయితీ, మాట నిలకడకు మారు పేరైన మత్స్యకారులు తమ కట్టుబాట్లను, సంస్కృతిని రక్షించుకోవాలని ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు పేర్కొన్నారు. 16.07.2019 మంగళవారం గురు పౌర్ణమి నాడు మత్స్యకార సంక్షేమ సమితి అద్వర్యం లో నెల్లూరులోని అచ్యుత సుబ్రహ్మణ్యం కళ్యాణమండపం నందు నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకార గ్రామాలలోని వివిధ దేవుళ్ళ భక్తి గురువులకు సన్మాన కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ శేషు మాట్లాడుతూ తర తరాలుగా మత్స్యకారులకు కొన్ని ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచారాలు ఉన్నాయని, అవే వారిని ఇన్నాళ్ళుగా పటిష్టంగా, ప్రత్యేకంగా, సమైక్యంగా నిలిపాయని తెలిపారు.

అయితే నేడు క్రైస్తవం రూపంలో మత్స్యకార గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన తెలిపారు. క్రైస్తవ పాస్టర్లు మత్స్యకార గ్రామాల్లోకి వచ్చి ఒకరిద్దరికి ఏవో మాయ మాటలు చెప్పో, ఆశపెట్టో మతం మార్చి వారి ఆధారంగా గ్రామాలలో చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి ఘటనలు గ్రామాలలో జరుగకుండా చూసుకోవాలని చెప్పారు. తీర ప్రాంతం దేశ రక్షణ దృష్ట్యా కూడా ఎంతో కీలకమైన ప్రాంతమని, తీర ప్రాంతంలో అన్య మతస్తుల ప్రాబల్యం పెరగడం వల్ల మత్స్యకారులు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న హైందవ సంస్కృతికి విఘాతం కలుగుతుందని, కనుక తీరప్రాంత గ్రామాలలో క్రైస్తవం వ్యాప్తి కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మత్స్యకారులందరిపైనా ఉన్నదని, తీరప్రాంత సంరక్షణ ఆ గంగ పుత్రులుగా మత్స్యకారులందరిపైనా ఉన్నదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తాళం భజన గురువులు, అయ్యప్ప మాలధారణ గురువులు, భవాని మాలధారణ గురువులు, వెంకటేశ్వరస్వామి మాలధారణ గురువులు, వెంకయ్యస్వామి మాలధారణ గురువులు ఇలా మొత్తం 348 మంది గురువులను మత్స్యకార సంక్షేమ సమితి సన్మానించింది.

ఇంకా ఈ కార్యక్రమంలో త్రిపుర రాష్ట్రంలోని  శ్రీమాత బాలా త్రిపుర సుందరి పీఠం నుండి శ్రీ శ్రీ శ్రీ కపాలనంద స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. మత్స్యకార కుటుంబాలందరూ చల్లగా వర్ధిల్లాలని, అందరికీ ఆ గంగమ్మ తల్లి కృపా కటాక్ష వీక్షణాలు లభించాలని ఆశీర్వదించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం నెల్లూరు జిల్లా ధర్మ ప్రచార పరిషత్ మాజీ కో – ఆర్డినేటర్ శ్రీ శ్రీహరి , ప్రస్తుత కో – ఆర్డినేటర్ శ్రీ సేవరాజు, ఎం.ఎస్.ఎస్ గౌరవాధ్యక్షులు శ్రీ కోడూరు జయరామయ్య , మరో గౌరవాధ్యక్షులు శ్రీ మైల శ్రీనివాస్ అర్జున కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలంగారి పొలయ్య, రాష్ట్ర కార్యదర్శి మహాలక్ష్మణరావు, రాష్ట్ర విద్యా కమిటీ అధ్యక్షులు పామంజి మురళి, రాష్ట్ర మత్స్యనారాయణ కమిటీ అధ్యక్షులు వావిల బాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాటంగారి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బుచ్చింగారి రాము తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా భక్తి ప్రపత్తులు, ఆనందోత్సాహాల మధ్య జరిగింది.