ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 21 ; భోగరాజు పట్టాభి సీతారామయ్య

223views

ఆంధ్రనాయకులు కొందరు తమ సొంత ప్రాంతం గురించేకాక మొత్తం దేశం గురించి ఆలోచించిన వారు. జాతీయ నాయకులతో పెద్ద వసమని సత్సంబంధాలు కలిగిన వారై, జాతీయ ఉద్యమాలను తీర్చిదిద్దారు. తమ సొంత పట్టణాలు, జిల్లాల మీద పూర్తి పట్టుతో, స్థానిక ప్రజలను నడిపించటమే కాక, ఆయా పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రచించిన వారు ఉన్నారు. వారిలో ఒకరు భోగరాజు పట్టాభి సీతారామయ్య.

అట్టడుగు స్థాయినుండి అత్యున్నత స్థానాలను అధిరోహించిన వ్యక్తి డా॥ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు. అసాధారణ ప్రతిభా విశేషాలతో అర్థశతాబ్ది పాటు భారతరాజకీయాల్లో ఆయన క్రియాశీల పాత్రను పోషించారు. మంచి వక్తగా, పత్రికా రచయితగా, సంపాదకుడుగా, కాంగ్రెసుపార్టీ అధికార చరిత్రకారుడుగా, గాంధీ సిద్ధాంతాలకు భాష్యకార్యుడుగా ఆయన వన్నెకెక్కారు. జాతీయవిద్య, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలలో ఆద్యుడుగా గుర్తింపుపొందారు. ఆయన ప్రవేశించిన ప్రతిరంగంలోనూ ఆయన విజయం సాధించారు. 1916లో ఆయన వైద్యవృత్తిని స్వాతంత్ర్య పోరాటం కోసం విరమించినపుడు అది వైద్య వృత్తికే పెద్ద నష్టమని అందరూ వ్యాఖ్యానించారు. ఆయన రోగనిర్ధారణ నైపుణ్యం అలాంటిది.

1913లో ఆయన ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ‘జన్మభూమి’ మూసివేసినప్పుడు, బాంబే క్రానికల్ సంపాదకత్వాన్ని తిరస్కరించినప్పుడు అది పత్రికారంగానికే తీరని నష్టమని ఆనాటి ప్రముఖ పాత్రికేయులు వ్యాఖ్యానించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రారంభానికి విశేషమైన కృషిచేసి ఆంధ్రుల కలను సాకారం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని ఆయనకు ఇచ్చే ప్రతిపాదన ఉందని సూచనాప్రాయంగా తెలియజేసి విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యత్వాన్ని అంగీకరించమని రాజగోపాలచారిగారు కోరగా ఆయన తిరస్కరించినప్పుడు విద్యావేత్తలు బాధపడ్డారు. మచిలీపట్నం, మద్రాసులో చదువుకుని ఎమ్.బి.సి.యమ్ పరీక్షలో 1906లో కృతార్థులై, మచిలీపట్నంలో తన వృత్తిని ప్రారంభించారు.

1912 నుండి హరిజన విద్యార్థులకు ఆంధ్ర జాతీయ కళాశాలలో ప్రవేశం కల్పించారు. హరిజన విద్యార్థులు, ఇతరులు ప్రక్కప్రక్కనే కలసి కూర్చుని చదువుకునేవారు. 1914లో కుటీర పరిశ్రమల నిర్వహణలో, 1916లో చేనేతలో శిక్షణను కళాశాలలో ప్రారంభించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంతో జాతీయ ఉద్యమం బలపడగా, ఆంధ్రజాతీయ కళాశాలలో అది వ్యక్తీకరించబడిందని ప్రముఖ చరిత్రకారులు మామిడిపూడివెంకటరంగయ్యగారు వ్యాఖ్యానించారు. 1921 లోనూ 1929లోనూ గాంధీగారు ఈ కళాశాలను సందర్శించారు. ఆంధ్రజాతీయ కళాశాల ఎడారిలో ఒయాసిస్సు వంటిదని ఆయన కొనియాడారు. 1908 – 1911 మధ్య పట్టాభిగారు మూడు సంవత్సరాలు కృష్ణాపత్రికకు సంపాదకునిగా వ్యవహరించడమే కాక, ఆ పత్రికకు ఆర్థికంగా పరిపుష్టి కలిగించారు.

1907లో బొంబాయి కాంగ్రెసు సమావేశాలలో స్వదేశీ ఉద్యమ ఆవశ్యకత గురించి పట్టాభి ప్రసంగించారు. పట్టాభిగారు సహకార ఉద్యమానికి అద్యులు, కృష్ణాజిల్లా సహకార బ్యాంకును రూ.50వేల పెట్టుబడితో 1915లో పట్టాభిగారు ప్రారంభించారు. అది క్రమంగా సహకార కేంద్ర బ్యాంకు స్థాయికి ఎదిగింది. గుడ్లవల్లేరు భూతనఖా బ్యాంకును 1927లో ఆయన స్థాపించారు. 1925లో ఆంధ్రాఇన్సూరెన్సు కంపెనీని, 1935లో హిందుస్థాన్ మ్యూచువల్ ఎష్యూరెన్స్ కంపెనీని ప్రారంభించారు. 1923లో ఆంధ్రాబ్యాంకును ఆయన స్థాపించారు. ఒక 15 రోజులలోనే లక్షరూపాయలను మూలధనంగా సేకరించి ఆయన విదా ఆంధ్రాబ్యాంకును ప్రారంభించటం విశేషం, 1929లో రూ.40వేల మూలధనంతో 23 ప్రారంభించిన భారతలక్ష్మి బ్యాంకును ఆయన ఆ తర్వాత ఆంధ్రాబ్యాంకులో విలీనం చేశారు. రైతులకు, చిరువ్యాపారులకు పెద్ద ఎత్తున ఋణసహాయం అందించేందుకు ఆయన బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించి కృతకృత్యులయ్యారు.

ప్రజల సమస్యలపై ఒక మహాసభను ఢిల్లీలో 1923 ఆగష్టులో నిర్వహించి, ఒక సంఘటిత ప్రజాఉద్యమానికి బీజాలు నాటారు. ఆయన ప్రయత్నాలు ఫలించి 1927లో ఇండియన్ స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్సు ప్రారంభించారు. తెలుగువారైన శ్రీ మోచర్ల రామచంద్రరావు గారి అధ్యక్షతన 1927 డిశెంబరులో దాని మొదటి సభ జరిగింది. 1929లో జరిగిన 2వ సమావేశానికి మరొక తెలుగు ప్రముఖులు సి.వై. చింతామణి గారు అధ్యక్షత వహించారు. 1936లో పట్టాభిగారు కరాచీలో జరిగిన సభలో పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షులుగా ఎన్నికైనారు. సంస్థానాల ప్రజల విముక్తి పోరాటచరిత్రలో ఆయన ఎన్నిక ఒకపెద్ద మలుపు. సంస్థానాల వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. అయినప్పటికీ పట్టాభిగారు దూరదృష్టితో సంస్థానాల ప్రజల బాగోగుల గురించి, సంస్థానాల విలీనంగురించి పెద్ద ఉద్యమం లేవదీశారు. భారతదేశం మొత్తం భూభాగంలోమూడవవంతు, జనాభాలో నాల్గవ వంతుకు పైగా ఉన్న సంస్థానాల ప్రజల 1 సమస్యలను పట్టించుకోకపోవటం, సంస్థానాల వ్యవహారాలలో జోక్యం చేసుకోబోమని అనటం పెద్ద చారిత్రక తప్పిదం అవుతుందని పట్టాభిగారు స్పష్టం చేశారు. సంస్థానాలతో కూడిన ఒక సమాఖ్యదేశంగా భారతదేశపు నిర్మాణం జరగాలని ఆయన మార్గదర్శకం చేశారు. కాని పట్టాభిగారి ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి నచ్చలేదు. గాంధీగారితోపాటు నెహ్రూ, పటేల్లు సైతం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

1935 ఇండియా చట్టాన్ని పట్టాభిగారు వ్యతిరేకించారు. సంస్థానాల ప్రజల భిప్రాయాన్ని మలచటానికి దేశంలో ఉన్న అన్ని పెద్ద సంస్థానాలను ఆయన పర్యటించారు. సంస్థానాల ప్రజల విముక్తి, సమగ్ర భారతదేశంలో సంస్థానాల విలీనం అనే లక్ష్యాలను ఆయన ప్రజలలో గట్టిగా తీసుకుని వెళ్ళగలిగారు. సంస్థానాల 21 విలీన ప్రక్రియకు కావలసిన పూర్వ భూమికను పట్టాభిగారు తయారు చేశారు. పట్టాభి గారి విధానాన్ని కాంగ్రెసు అంగీకరించకతప్పని పరిస్థితి ఏర్పడింది.

1959 డిశెంబరు 16న ఆయన స్వర్గస్థులయ్యారు. వారు దేశానికి చేసిన సేవలకు గాను జాతి ఎన్నటికీ ఆయనకు ఋణపడి ఉంటుంది.