
వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆరెస్సెస్ ఉద్దేశమని విద్యాభారతి దక్షిణ క్షేత్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదని, రాజకీయాలతో సంబంధం ఉండదని వివరించారు. ఈ సంస్థపై అవగాహన లేని వారు భ్రమలు, అపోహలను సమాజంలో నింపారని అన్నారు.
ఆరెస్సెస్ ఏర్పాటై వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడలో వైభవ భారతం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రజల్లో ఐకమత్యం లేక దేశం అనేకసార్లు బానిసత్వం అనుభవించింది. మరోసారి అలా జరగకూడదన్న ఉద్దేశంతో ఐకమత్యాన్ని, జాతీయవాద భావాన్ని పెంపొందించేందుకే ఆరెస్సెస్ స్థాపించారు. ఇక్కడ నేర్పేది దేశభక్తి మాత్రమే. భారతీయ విలువలను ప్రపంచానికి అందిస్తున్న ఘనత ఆరెస్సెస్‌కే దక్కుతుంది. దీనిపై అవగాహన లేని వారు భ్రమలు, అపోహలను సమాజంలో నింపారు. సంఘం గురించి అర్థం చేసుకోవాలంటే సంఘంలో చేరాలి’ అని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరెస్సెస్ విభాగ సంచాలక్ కోనేరు దుర్గాప్రసాద్, జిల్లా సంచాలక్ అన్నదేవర కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.





