
సాగర సంగమ ప్రాంతం కల్యాణ కాంతులతో కొత్త సొబగులు అద్దుకుంది. లక్ష్మీనృసింహస్వామివారి దివ్య పరిణయోత్సవాలకు శుభ సమయం ఆసన్నమవుతున్న వేళ.. అందరి దృష్టి అంతర్వేది వైపే. పరిణయోత్సవాన్ని నేత్రపర్వంగా వీక్షించి ప్రణమిల్లాలని, భక్తిపూర్వకంగా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలని అంతా తరలివస్తున్న వేళ.. దివ్యధామం సర్వం సన్నద్ధమైంది. సోమవారం రాత్రి 12.29 గంటలకు స్వామివారి జగత్కల్యాణాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు శేషవాహనంపై విహరించారు.
ప్రత్యేక బస్సు సర్వీసులు
కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 135 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. రాజోలు, అమలాపురం, రావులపాలెం, నర్సాపురం, భీమవరం నుంచి వచ్చే 100 వరకు బస్సులు మలికిపురంలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకుంటాయి. అక్కడ్నుంచి అంతర్వేది దేవస్థానానికి భక్తులను తీసుకువెళ్లేందుకు 25 సర్వీసులను సిద్ధం చేశారు. సఖినేటిపల్లి రేవు నుంచి వచ్చే భక్తుల కోసం పది బస్సులను ఏర్పాటు చేశారు.
వాహనాల పార్కింగ్ ఇలా..
అంతర్వేదిపాలెం కూడలి మీదుగా కాల్వమొగ నుంచి ఆలయానికి వచ్చే వాహనాలకు గుర్రాలక్కమ్మ ఆలయం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. దర్శనాలు చేసుకున్న అనంతరం తిరిగి వెళ్లేందుకు భక్తులు దండుపుంత మీదుగా హనుమాన్ ఆలయం నుంచి బయటకు వెళ్లాలి. వీఐపీల వాహనాలకు కల్యాణ మండపానికి సమీపంలో పార్కింగ్ ఇచ్చారు. వారు తిరిగి వెళ్లేటప్పుడు ఏటిగట్టు, గొంది మీదుగా వెళ్లాలి.
వేడుక తిలకించేందుకు ఎల్‌ఈడీ తెరలు
తీర్థ స్థలిలో ఎక్కడ్నుంచైనా కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. భక్తుల విశ్రాంతి కోసం తాత్కాలిక షెడ్లు వేశారు. ఎంపీపీ పాఠశాల, దేవస్థానం లోపల, వెలుపల, తాత్కాలిక షెడ్లు, శివాలయం వద్ద వైద్య శిబిరాలను అందుబాటులోకి తెచ్చారు.
పటిష్టంగా పోలీసు బందోబస్తు
ఉత్సవాల్లో బందోబస్తు కోసం 1,600 మంది పోలీసు సిబ్బందిని సిద్ధం చేశారు. ఎస్పీ శ్రీధర్, డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులకు సూచనలిచ్చి వారిని నిర్దేశించిన ప్రాంతాల్లో నియమించారు. వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ, తీర్థ స్థలి చుట్టూ వలయాలుగా వీరు ఉంటారు. కల్యాణ వేదిక చుట్టూ పటిష్టమైన రక్షణ, ఆలయం నుంచి వేదిక వరకు ఉత్సవమూర్తులను తీసుకువచ్చేటప్పుడు బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు కంట్రోలు రూమ్‌ను సిద్ధం చేశారు. తీర్థ స్థలితో పాటు సముద్ర స్నానాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు.





