
మధ్యప్రదేశ్‌లోని సిల్లియర్‌పూర్ గ్రామం సమీపంలోని అడవి వద్ద వందలాది ఆవుల కళేబరాలు కనిపించడం సంచలనం కలిగించింది. ఇందుకుగల కారణాలు తెలియరాలేదు. ఇవేమైనా వ్యాధితో చనిపోయాయా? ఎక్కడ నుంచి తీసుకొచ్చి పడేశారు? తదితర సమాచారమేమీ వెల్లడి కాలేదు. రాత్రిపూట సమీపంలోని పట్టణాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. కనీసం 400-500 ఆవుల కళేబరాలు అక్కడ పడి ఉన్నాయని, దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రామ ప్రధాన్ చెప్పారు. సమీపంలోని కరైరా మున్సిపాలిటీలో చనిపోయిన ఆవులను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారని స్థానిక పశువైద్యుడు డాక్టర్ వాదిల్ జాతవ్ చెప్పారు. తీవ్రమైన చలి కారణంగా ఆ ఆవులన్నీ చనిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. చనిపోయిన జంతువులను సల్లియపూర్ గ్రామం అడవి వద్ద పడేస్తుంటామని మున్సిపాలిటీ కార్మికులు కూడా చెప్పారని వివరించారు.




