News

కార్తిక దీపం సర్వశ్రేష్టం : కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి

378views

వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సంప్రదాయాలకు కార్తికమాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వందల రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తిక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీతీర్థ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ దీపాన్ని వెలిగిస్తే మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ మాసంలో నాగులచవితి, భైరవాష్టమి పర్వదినాలు రావడం శుభసూచికమని చెప్పారు. పూజ కంటే స్తోత్రం, స్తోత్రం కంటే జపం, జపం కంటే ధ్యానం, ధ్యానం కంటే ఏకాగ్రతతో కూడిన సమాధి స్థితి కోటి రెట్లు ఉత్తమమైనవన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ఈ స్థితిని సాధించాలని కోరారు. దైవనామాన్ని జపిస్తే దీర్ఘాయువు కలుగుతుందన్నారు. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీనివాసుని కటాక్షం కలగాలని స్వామీజీ ఆకాంక్షించారు.