News

వారసత్వ ఆస్తి విషయంలో హిందూ చట్టాన్ని ముస్లిం చట్టం కింద వర్తింపజేయలేం : సుప్రీంకోర్టు

273views

అన్ని మతాలకు వర్తించేలా ఉమ్మడి వైయక్తిక చట్టం (పర్సనల్‌ లా) రూపకల్పనను చట్టసభలు చేయవచ్చని, వారసత్వ ఆస్తి విషయంలో హిందూ చట్టాన్ని ముస్లిం చట్టం కింద కూడా వర్తింపజేయాలని తామెలా చెబుతామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వారసత్వానికి సంబంధించి ‘ముస్లిం వైయక్తిక చట్టం (షరియత్‌)- 1937’ కింద దాఖలైన ఒక పిటిషన్‌ను అనుమతించడానికి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాల ధర్మాసనం సోమవారం నిరాకరించింది. వేర్వేరు మతాలవారికి వేర్వేరు వైయక్తిక చట్టాలు ఉంటాయని పేర్కొంది. మతంతో ప్రమేయం లేకుండా వారసత్వ ఆస్తుల విషయంలో సమాన హక్కులు కల్పించాలన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించలేమని తెలిపింది.

మహిళా పిటిషనర్‌ తరఫున న్యాయవాది మాథ్యూ నెడుంపర వాదనలు వినిపిస్తూ- షరియత్‌ చట్టం ప్రకారమైతే ముస్లిం మహిళకు తన భర్త ఆస్తిలో 12.5 శాతం పొందడానికే అర్హత ఉంటుందని చెప్పారు. మతానికి అతీతంగా పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలన్నారు. అలాంటి చట్టం చేయడం చట్టసభ పరిధిలో విషయమని, అందువల్ల రిట్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.