News

శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం నివేదించాలి!

303views

విజయ దశమి, దసరాగా పిలిచే పర్వదినాలు మొదలయ్యాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మనలో ఉండే చెడుని నాశనం చేయాలని మొదటి మూడు రోజులు, సంపదను ప్రసాదించాలని తర్వాతి మూడు రోజులు, జ్ఞానాన్నివ్వాలని చివరి మూడు రోజులు ప్రార్థిస్తారు. అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రంగు వస్త్రం సమర్పిస్తారు. ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం నివేదిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి – శైల పుత్రి
సతీదేవి యోగాగ్నిలో ఆహుతి అయిన తర్వాత పర్వతరాజైన హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించింది. వృషభ వాహనంపై దర్శనమిచ్చే అమ్మవారి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం, తలపై చంద్రవంక ధరించి ఉంటుంది. ఈ రోజు అమ్మవారిని మల్లెపూలతో పూజిస్తారు. పొంగల్ నైవేద్యంగా నివేదిస్తారు.

రెండో రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ – బ్రహ్మచారిణి
కుడి చేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించి పరమేశ్వరుడిని పతిగా పొందేందుకు ఘోరతపస్సు చేసి ఉమగా పూజలందుకునే రూపం ఇది. బ్రహ్మచారిణి అనుగ్రహం వల్ల సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు అమ్మవారిని విభిన్న రకాల పూలతో పూజించి పులిహోర నివేదిస్తారు.

మూడో రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ – చంద్రఘంట
తలపై అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడంతో ‘చంద్రఘంట’ అని పిలుస్తారు. సింహవాహనంపై బంగారు కాంతితో మెరిసిపోయే అమ్మవారి పదిచేతుల్లో ఖడ్గం, శస్త్రాలు, బాణం సహా పలు అస్త్రాలు ధరించి దర్శనమిస్తుంది. ఈ రోజు సంపంగి పూలు, తులసి ఆకుతో పూజిస్తారు. వివిధ రకాల పండ్లతో తయారు చేసిన ప్రసాదాన్ని నివేదిస్తారు.

నాలుగో రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి- కూష్మాండ
బ్రహ్మాండంలో సకల వస్తువులలో, ప్రాణుల్లో తేజస్సు అంతా కూష్మాండ దుర్గ ఛాయే అని భక్తులు విశ్వసిస్తారు. ‘అష్టభుజాదేవి’ అని పిలిచే ఈ చల్లని తల్లి ఏడు చేతుల్లో కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలం, చక్రం, గద ఉంటాయి. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులు, నిధులను ప్రసాదించే జపమాల ఉంటుంది. కూష్మాండ దుర్గను పూజిస్తే బాధలు నశించిపోతాయని, ఆయు ఆరోగ్యం వృద్ధి చెందతుందని చెబుతారు. ఈ రోజున అమ్మవారిని జాజి మల్లెపూలతో పూజిస్తారు. జామపండు నివేదిస్తారు. మాహానైవేద్యం సమర్పిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించేవారి సంఖ్య ఎక్కువే.

ఐదో రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి – స్కందమాత
నవరాత్రులలో ఐదో రోజు దుర్గాదేవిని ‘స్కందమాత’పేరుతో ఆరాధిస్తారు. ఒడిలో బాలస్కందుడిని చేతపట్టుకుని కుడిచేత పద్మం ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒకచేత్తో అభయముద్ర, మరొకచేత్తో కమలం ధరించి సింహవాహనంపై కూర్చుని ఉంటుంది. స్కందమాతను ఉపాసించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని , సుఖ శాంతులు ఉంటాయని పండితులు చెబుతారు. నిర్మలమైన దేవతకు అరటిపండ్లను ప్రసాదంగా అందజేస్తారు. పెరుగు మరియు దానిమ్మపండును నైవేద్యంగా సమర్పి ఆనవాయితీ. ఈ రోజున స్కందమాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం చేకూరుతుందని విశ్వాసం.

ఆరో రోజు ఆశ్వయుజ శుద్ధ షష్టి – కాత్యాయని
బాధ్రపదబహుళ చతుర్దశి రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయని మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది “కాత్యాయనీ మాత”.నాలుగు భుజాలతో విరాజిల్లే కాత్యాయని కుడిచేతిలో అభయ ముద్ర, వరముద్రను కలిగిఉంటుంది. ఎడమచేతిలో ఖడ్గం, పద్మం పట్టుకుని సింహవాహనంపై కొలువై సేవలందుకుంటుంది. ఈ దేవిని భక్తితో సేవించినవారికి చతుర్విధ పురుషార్ధాల ఫలం లభిస్తుందని చెబుతారు. ఎర్రని పువ్వులు, చందనం ఆకులతో ఆమెను పూజిస్తారు. అన్నం, కొబ్బరితో చేసిన ప్రసాదం అందిస్తారు.

ఏడో రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి – కాళరాత్రి
“కాళరాత్రి” శరీరవర్ణం గాఢాంధకారంలా నల్లగా ఉంటుంది. తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి. ఈమె త్రినేత్రాలు బ్రహ్మాండంలా గుండ్రంగా ఉంటాయి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరమైన అగ్నిజ్వాలలు కక్కుతూ ఉంటుంది. కాళరాత్రి వాహనం గార్ధభం. కుడిచేతిలో వరముద్ర, అభయముద్ర,ఎడమ చేతిలో ఇనపముళ్ల ఆయుధం, ఖడ్గం ధరించి ఉంటుంది. కాళరాత్రి స్వరూపం చూసేందుకు భయంకరంగా ఉన్నప్పటికీ ఈ అమ్మ ఎప్పుడూ శుభాలే ప్రసాదిస్తుంది. అందుకే శుభంకరీ అని అంటారు. కాళరాత్రి దుర్గను స్మరిస్తే శత్రుభయం ఉండదని చెబుతారు. ఖర్జూరం, తేనె, నెయ్యితో తయారు చేసిన ప్రసాదం అందిస్తారు.

ఎనిమిదో రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి – మహాగౌరి
ఈమె చతుర్భుజాలతో వృషభవాహనంపై కొలువై ఉంటుంది. కుడిచేతుల్లో అభయముద్ర, త్రిశూలం..ఎడమచేతుల్లో ఢమరుకం, వరముద్ర కలిగి ఉంటుంది. ఈ తల్లి దర్శనం ప్రశాంతతనిస్తుంది. పార్వతి దేవి అవతారంలో పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేయడంతో నలుపెక్కిన అమ్మవారికి గంగాజలంలో అభిషేకం చేయడంతో శ్వేతవర్ణంలో మహాగౌరిగా మారింది. ఈ అమ్మను ఉపాసించిన భక్తుల్లో కల్మషాలు ఉండవు. ఈరోజు మహాగౌరిని గులాబీ పూలతో పూజిస్తారు. పాలు అన్నం, ద్రాక్ష పండ్లు నైవేద్యంగా అందిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ నవమి – సిద్దిధాత్రి
సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లిని సిద్ధి ధాత్రి అంటారు. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవీ కృపవల్లే పొందాడని దేవీపురాణం చెబుతుంది. కుడిచేతల్లో చక్రం, గద, ఎడమచేతుల్లో శంఖం, కమలం ఉంటాయి. సిద్ధిధాత్రిని ఆరాధిస్తే సకలసిద్ధులు కలుగుతాయంటారు. ఈ రోజున నువ్వులతో తయారు చేసిన వంటకాలు అయినా స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ దశమి – దుర్గామాత
అక్టోబర్ 24 మంగళవారం శారదీయ నవరాత్రుల పదవ రోజు. దీనిని విజయదశమిగా జరుపుకుంటారు.ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇది శుభానికి సంకేతం. గారెలు, పాయసం అన్ని అమ్మవారికి నివేదిస్తారు..