News

చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఇకపై ప్రతి ఏటా ఆగస్టు 23వ తేదీన..: కేంద్రం నోటిఫికేషన్ జారీ

449views

2023 ఆగస్టు 23వ తేదీ. దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు అది. ఆ రోజే చందమామ మన చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. మాడ్యుల్ చందమామ దక్షిణ ధృవంపై అడుగు మోపింది ఆ రోజే.

ఈ ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారన్ని సేకరించింది ఇస్రో. చందమామ దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేకించి- సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించింది. మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ సైతం ఉందనే విషయాన్ని ఇస్రో నిర్ధారించింది ఈ ప్రయోగం ద్వారానే.

చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చంద్రయాన్ 3 జాబిల్లి పై అడుగుపెట్టిన రోజైన ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవం (National Space Day)గా జరుపుకోవాలని నిర్ణయించిది. ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఆ రోజునాడు ప్రత్యేకంగా సైన్స్ ఎగ్జిబిషన్లు, సెమినార్లను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్‌మెంట్ అదనపు కార్యదర్శి సంధ్యా వేణుగోపాల్ శర్మ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందారోజున. దీనివల్ల యువతలో స్పేస్ పట్ల మరింత అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు.