Articles

ఏకాత్మ వాదాన్ని ప్రతిపాదించిన మహాతత్వవేత్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ..

319views

(సెప్టెంబర్ 25 – దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి )

కొందరు మరణించేవరకు జీవిస్తారు..కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయజీ రెండవ కోవకు చెందిన వ్యక్తి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా తన ఆలోచనలు, సిద్ధాంతాల ద్వారా సజీవంగా ఉన్నారు. స్వశక్తి భారత్ కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేసిన ధీరోదాత్తుడు. అతిసామాన్యమైన కుటుంబంలో పుట్టి అసమాన్య వ్యక్తిగా ఆయన ఎదిగిన క్రమం ఎందరికో స్ఫూర్తిదాయకం.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయజీ 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా ఫరా పట్టణ సమీపంలోని నాగ్లా చంద్రభాన్ అనే కుగ్రామంలో జన్మించారు. తల్లి రామ్ ప్యారీ, తండ్రి భగవతీ ప్రసాద్. దీన్‌దయాళ్‌జీ తన 3వ ఏటనే తండ్రిని కోల్పోయారు. 8 ఏళ్ల వయసులో మాతృవియోగం సంభవించింది. దీంతో ఆయన తన మేనమామ ఇంట పెరిగారు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయినా…ఎన్ని కష్టాలు వచ్చినా..ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు ఆయనలోని పోరాట స్ఫూర్తికి నిదర్శనం.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయజీ 1925లో ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టారు. ఆయన కాన్పూర్‌లో బీఏ చదివారు. ఆ సమయంలోనే బల్వంత్ మహాశాబ్డేతో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రోద్బలంతోనే 1937లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో సభ్యునిగా చేరారు. అప్పటి నుంచి ఆయన జీవనవవిధానం, గమ్యం మారిపోయాయి. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌జీ రాష్ట్ర ధర్మ ప్రకాశన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా రాష్ట్ర ధర్మ అనే మాసపత్రికను, ఆ తర్వాత పాంచజన్య అనే వారపత్రికను స్థాపించారు. తరువాత కాలంలో స్వదేశ్ అనే దినపత్రికను స్థాపించి సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రికలు దీన్‌దయాళ్‌జీ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి. ఆనాడు గాంధీజీని కాల్చి చంపిన నేరాన్ని ఆర్‌ఎస్‌ఎస్ పై మోపి అప్పటి ప్రధాని నెహ్రూ సంఘ్‌ను నిషేధిస్తే దాన్ని తొలిగించాలంటూ జరిపిన ఉద్యమంలో దీన్‌దయాళ్‌జీ కీలకపాత్ర పోషించారు. 1952లో భారతీయజనసంఘ్‌లో చేరి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీజీ మరణానంతరం 1967లో జన్‌సంఘ్‌కు అధ్యక్షులయ్యారు. పార్టీని తన భుజాలపై నడిపించారు.

జన్‌సంఘ్ రాజకీయపార్టీగా రూపుదిద్దుకోవడంలో దీన్‌దయాళ్‌జీ పాత్ర కీలకం. తనతో పాటు ఇద్దరు దీన్‌దయాళ్లు ఉంటే చాలు భారతదేశపు రాజకీయ స్వరూపాన్ని మార్చివేయగలనంటూ డాక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయజీ ఔన్యత్నం, దేశంపట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఏపాటిదో ఈ మాటలు చెప్పకనే చెబుతాయి. ఆదర్శమహాపురుషుల్లో పండిట్ దీన్‌దయాళ్‌జీ ముందువరుసలో ఉంటారు. మహాపురుషుడు అంటూ ఆయన విరోధులు సైతం కొనియాడేవారు. ప్రజా సోషలిస్ట్ పార్టీ నాయకులు నాదపాయ్ గాంధీ మన దీన్‌దయాళ్‌జీని తిలక్, బోసు పరంపరలో ఒకరిగా అభివర్ణిస్తే..నాటి కమ్యునిస్ట్ నాయకులు హిరేన్..దీన్ దయాళ్‌జీని అజాతశత్రువుగా పేర్కొన్నారు.

దీన్‌దయాళ్‌జీ ఉపాధ్యాయ యువకుడిగా ఉన్నప్పుడే వ్యక్తి, సమాజం, స్వదేశీ, స్వధర్మం, పరంపర, సంస్కృతి వంటి విషయాలపై ఆకర్షితులయ్యారు. వీటిపై లోతు అధ్యయనం చేశారు కూడా. జాతిసమగ్ర ఉన్నతిని సాధించడంలో సమర్థవంతమైన ఒక రాజనీతి సిద్ధాంతాన్ని వికసింపజేయాలని కోరుకునేవారు. ప్రతివ్యక్తిని అభివృద్ధి వైపు, సమృద్ధి వైపు సంతోషం వైపు తీసుకెళ్లగల ఏకాత్మ మానవవాదం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాతత్వవేత్త ఆయన. ఏకాత్మ మానవవాదం ఒక దేశానికో, ఒక జాతికో, ఒక మతానికో కాకుండా విశ్వమానవ కల్యాణానికి బాటలు వేయడం విశేషం. ప్రతి వ్యక్తి సర్వాంగణ వికాశమే లక్ష్యంగా మన ఆర్థిక, సామాజిక, రాజకీయ విధివిధానాలు రూపొందించినప్పుడు సర్వశ్రేష్ఠ భారత్ నిర్మాణం సాధ్యం. భారత్ అన్ని రంగాల్లో ఎదగాలంటే విదేశీయ భావజాలం, వ్యక్తివాదం, కమ్యునిజం తదితర సిద్ధాంతాలకు బదులు జాతీయత, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత అవసరమని దీన్‌దయాళ్‌జీ చెబుతారు. మత రాజ్యాలు మారణ హోమానికి, పెట్టుబడిదారీ సిద్ధాంతం దోపిడీ వ్యవస్థకు దారి తీయగా, కమ్యునిజం నిరంకుశత్వానికి, నిర్బంధాలకు దారితీసి వ్యక్తి స్వేచ్ఛను అణిచివేసింది. ఇందుకు కారణం భౌతికవాద సిద్ధాంతాలన్నీ మనిషిని ఆర్థికజీవిగా మాత్రమే పరిగణించి అతని భౌతిక అవసరాలు తీరిస్తే సరిపోతుందని భావించడమే అని దీన్‌దయాళ్‌జీ విశ్లేషించారు. ఏకాత్మ మానవవాదం సిద్ధాంతం ప్రకారం వ్యక్తి శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల కలయిక. అలాగే సమాజం కూడా ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనస్సు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మను కలిగి ఉంటుంది. వ్యక్తితో పాటు సమాజం కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షం ఈ నాలుగు పురుషార్థాలను ఆచరించినప్పుడు వ్యక్తి, సమాజం పరస్పర సహకారపూరకాలుగా ఉండి, పరస్పరం అభివృద్ధి చెంది, మానవత్వం పునాదిగా దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని దీన్‌దయాళ్‌జీ సూత్రీకరించారు.

ఏకాత్మమానవ వాదాన్ని సైద్ధాంతిక భూమికగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆ మార్గంలో పయనిస్తోంది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానం, ఉజ్వల యోజన ద్వారా పేదలకు గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇళ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, మారుమూల ప్రాంతాలకు దీన్‌దయాళ్ గ్రామజ్యోతి యోజన ద్వారా కరెంట్ సరఫరా, దీన్‌దయాళ్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సబ్ కా సాత్ సబ్ కా వికాశ్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో దీన్‌దయాళ్ ఆలోచనలకు అనుగుణంగా భారత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రపంచంలో ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఇలా అన్ని రంగాల్లో స్వశక్తిగా ఎదగడం కోసం కృషి చేస్తోంది. బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన ఇలా అనేక పథకాలు దీన్‌దయాళ్‌జీ ఆశయాలకు అనుగుణంగా ప్రవేశపెడుతూ భారతప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముందుకెళ్తోంది. దేశంలో ప్రతిఒక్కరూ దీన్‌దయాళ్‌జీ అడుగుజాడల్లో నడిచి భారత్‌ను ప్రపంచంలోనే మేటిగా నిలిపేందుకు కృషి చేయాలి.