News

శ్రీశైలంలో దర్శన వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం..

30views

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులకు మరింత పారదర్శకంగా, ప్రశాంతంగా స్వామి-అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ఆలయ యాజమాన్యం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దర్శన విధానాల్లో సమగ్ర ప్రక్షాళన అవసరమైందని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు వెల్లడించారు.

ఆయన ఆలయంలోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లు, గర్భాలయం పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను తప్పుదోవ పట్టిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న పలువురు దళారులను గుర్తించి ఆలయ పరిసరాల నుంచి బయటకు పంపించారు. టికెట్లు లేకుండానే భక్తులకు ప్రవేశం కల్పించేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకుని సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసి దేవస్థానం ఆదాయానికి గండి కొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దేవస్థానానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గాల్లో తమ సొంత ఖాతాల్లోకి మళ్లించే దళారులను ప్రోత్సహించడం ఏమాత్రం సమంజసం కాదని అధికారులకు, సిబ్బందికి సూచించారు.

భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా దర్శన విధానాల్లో అవసరమైన మార్పులు చేపడతామని తెలిపారు. ఉభయ దేవాలయాల్లో జరిగే ఆర్జిత సేవలు, దర్శనాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ట్రస్ట్‌బోర్డు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

తనిఖీల సందర్భంగా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడిన చైర్మన్, వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకుని, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.