News

అరకులో ఘనంగా ‘ట్రైబల్ ఆర్టిజన్ ఎంపవర్‌మెంట్ మేళా’

6views

 

అరకు వ్యాలీ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED), పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) సంయుక్త ఆధ్వర్యంలో అరకు వ్యాలీలోని ఏపీటీడీసీ గోష్ఠి మీటింగ్ హాల్‌లో గురువారం వనవాసీ కళాకారుల ఎంపానెల్‌మెంట్ మేళా ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిషాంతి టి. రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనవాసీ మహిళలు, స్వయం సహాయక సంఘాలు (SHGs), వనధన్ వికాస్ కేంద్రాలు (VDVKs), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) తయారు చేసిన ఉత్పత్తులు నాణ్యత, వైవిధ్యం పరంగా ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి వచ్చిన ట్రైఫెడ్ ఉన్నతాధికారులు స్థానికంగా ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి నాణ్యమైన వాటిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఎంపికైన ఉత్పత్తులను ట్రైఫెడ్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విక్రయ కేంద్రాల్లో మార్కెటింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో వనవాసీ కళాకారులకు జాతీయ స్థాయిలో మార్కెట్ లభించి, ఆదాయం పెరిగే అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల ప్యాకేజింగ్, లేబులింగ్, బ్రాండింగ్ అంశాల్లో మెరుగుదల అవసరమని కలెక్టర్ సూచించారు. వనవాసీ కళాకారుల నైపుణ్యాభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా వచ్చే ఒకటి రెండు నెలల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

మేళా ప్రధాన ఉద్దేశ్యం వనవాసీ కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల నిపుణులు, అటవీ ఉత్పత్తుల తయారీదారులు, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే వారిని ట్రైఫెడ్‌తో ఎంపానెల్ చేసి దేశవ్యాప్త మార్కెటింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయడమేనని అధికారులు వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా కళాకారులకు గిట్టుబాటు ధరలు, స్థిరమైన ఆదాయం, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ మేళాలో సుమారు 120 మంది వనవాసీ కళాకారులు పాల్గొని వెదురు ఉత్పత్తులు, లక్క బొమ్మలు, అరకు కాఫీ, తేనె, చిరుధాన్యాలు, నల్ల మిరియాలు, పసుపు, అల్లం, ఊరగాయలు, మట్టి పాత్రలు, సహజ ఆహార ఉత్పత్తులు తదితర వస్తువులను ప్రదర్శించారు. ప్రదర్శించిన ఉత్పత్తులు వనవాసీల సాంప్రదాయ నైపుణ్యం, సృజనాత్మకత, భారతీయ సంస్కృతి, ప్రకృతి ఆధారిత జీవన విధానాన్ని ప్రతిబింబించాయి.

ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ అరకు కాఫీ, వెదురు ఉత్పత్తులు, మట్టి కళలు వంటి స్థానిక వనవాసీ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. కళాకారులు విలువ జోడించిన  ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మరింత ఆదాయం, గుర్తింపు పొందవచ్చని సూచించారు. ట్రైఫెడ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ట్రైఫెడ్ ప్రాంతీయ మేనేజర్ భాస్కర్ ఝా ఎంపానెల్‌మెంట్ అర్హతలు, నమోదు విధానం, ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ, మార్కెటింగ్ అవకాశాలు, ట్రైఫెడ్ అందించే సహాయ కార్యక్రమాలపై కళాకారులకు సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ వివిధ స్టాళ్లను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించి కళాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

కార్యక్రమానికి హాజరైన అర్హులైన వనవాసీ కళాకారులకు ప్రయాణ భత్యంతో పాటు భోజనం, ఇతర అవసరమైన సౌకర్యాలను ట్రైఫెడ్, ఐటిడిఏ సంయుక్తంగా కల్పించాయి.

అరకు, అనంతగిరి, డుంబ్రిగూడ, పాడేరు, హుక్కుంపేట, చింతపల్లి, జి. మాడుగుల, జి.కె. వీధి తదితర మండలాల నుంచి వచ్చిన VDVKs, FPOలు, మహిళా ఉత్పత్తిదారుల సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ముఖ్యంగా అరకు కాఫీ, వెదురు కళాఖండాలు, లక్క బొమ్మలు, తేనె, చిరుధాన్యాలు, పసుపు, మిరియాలు, అల్లం, చింతపండు, 3D దుస్తుల డిజైన్లు వంటి ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వనవాసీ కళలు, సాంప్రదాయ వృత్తులను పరిరక్షిస్తూ వారి ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా వనవాసీ సమాజ ఆర్థిక సాధికారతను పెంపొందించాలనే లక్ష్యంతో ట్రైఫెడ్, ఐటిడిఏ పాడేరు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అభినందించారు.