News

“RSS @100: A Century of Resolve” పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్

2views

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రచయితలు శ్యామ్ జాజు మరియు అనుపమ్ త్రివేది రచించిన “RSS @100: A Century of Resolve” పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తన అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది సందర్భంగా వెలువడిన ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం తనకు వ్యక్తిగతంగా గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. సంఘ్‌తో తనకు చాలా కాలంగా అనుబంధం ఉందని పేర్కొన్న ఆయన, సంఘ్ సేవా తత్వాన్ని ఒక తమిళ కవితలో పవిత్ర గంగానదితో పోల్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతరుల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా ప్రవహించే గంగలా, సంఘ్ కూడా గత వందేళ్లుగా సమాజ సేవనే తన మార్గంగా ఎంచుకుందని అన్నారు.

భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, నాగరికత మూలాలను పరిరక్షిస్తూ, వాటిని బలోపేతం చేసే దిశగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ద కాలంగా నిరంతర కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పుస్తక శీర్షికలోని “A Century of Resolve” భావం సంఘ్ స్వయంసేవకుల సేవా నిబద్ధత, ఐక్యత, త్యాగస్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.సేవ అనేది సమాజం పట్ల నిస్వార్థ అంకితభావానికి ప్రతీక కాగా, ఐక్యత భారతదేశ భాషా, ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యాలను ఒకే జాతీయ భావనతో అనుసంధానించే శక్తిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. అలాగే, అంకితభావం, క్రమశిక్షణ, త్యాగం ద్వారానే శాశ్వత సంస్థలు నిర్మితమవుతాయని పేర్కొన్నారు.

“శాఖ” వ్యక్తిత్వ వికాసానికి కేంద్రం
ఆర్‌ఎస్‌ఎస్ “శాఖ”ను ఉపరాష్ట్రపతి “ఆత్మకు కార్యశాల” (Workshop of the Soul)గా అభివర్ణించారు. యువతలోని శక్తిని క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం కలిగిన జాతీయ వ్యక్తిత్వంగా తీర్చిదిద్దే ప్రక్రియ శాఖలో జరుగుతుందని అన్నారు. అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో, అత్యున్నత ప్రమాణాలతో నిర్వర్తించడమే స్వయంసేవకుని ప్రధాన లక్షణమని ఆయన పేర్కొన్నారు.

జాతీయ చైతన్యాన్ని బలోపేతం చేసిన సంఘ్
భారతదేశ నాగరికతా వారసత్వం, ఆధ్యాత్మిక సంపద, భాషా వైవిధ్యం, సాంస్కృతిక సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడంలో ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు. శతాబ్ది సంవత్సరం లక్షలాది మంది స్వయంసేవకుల సేవా తపనను గుర్తు చేసుకునే అవకాశంగా నిలుస్తుందని పేర్కొన్నారు.దృఢమైన విశ్వాసం, నిస్వార్థ సేవ, గొప్ప లక్ష్యాల సాధన పట్ల అచంచల నిబద్ధత ఉన్నప్పుడే ఏ సంస్థ అయినా శతాబ్దాల పాటు నిలదొక్కుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్‌ఎస్‌ఎస్ ఉత్తర ప్రాంత సంఘచాలక్ పవన్ జిందాల్, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్, పుస్తక రచయితలు శ్యామ్ జాజు, అనుపమ్ త్రివేది, ప్రభాత్ ప్రకాశన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.