ArticlesNews

మూర్తీభవించిన ఆదర్శం ‘చిలుకూరి”

31views

నిండైన విగ్రహం. అమిత నిగ్రహశాలి. నుదుటన పెద్దబొట్టు. మందస్మిత మోము. స్ఫురద్రూపిత్వం. కళ్లలో తీక్షణతో కూడిన వాత్సల్యం. అచ్చ తెనుగు పంచెకట్టు. భుజాల చుట్టూ ఉత్తరీయం. మాతృభాషలోని వివిధ యాసల్లో స్పష్టమైన ఉచ్చారణ. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేతత్వం. ఆదర్శ ఆచార్యుడు (ప్రొఫెసర్‌). ‌వృత్తి, ప్రవృత్తులకు సమన్యాయం. సంఘకార్యమంటే శ్వాస. విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ప్రాంత కార్యవాహగా, ఉమ్మడి ఆంధప్రదేశ్‌, ‌కర్ణాటక రాష్ట్రాలకు (క్షేత్ర) సంఘచాలక్‌గా అనేక సంవత్సరాలు సంఘకార్యానికి మార్గదర్శనం చేశారు. ఆ సలక్షణ సమన్వితులే ఆచార్య చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి.

కృష్ణాజిల్లా వానపాముల గ్రామంలో సెప్టెంబర్‌ 9,1928‌న సుబ్రహ్మణ్యశాస్త్రి (సుబ్బన్న) జన్మించారు. ఉపాధ్యాయుడైన తండ్రి వీరావధానిగారు నూజివీడు ఎస్‌ఆర్‌ఆర్‌ ఉన్నత పాఠశాలకు బదిలీ కావడంతో సుబ్బన్న అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. గుంటూరు ఏసీ కళాశాల, విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ ‌కళాశాలలో ఇంటర్మీడియట్‌ ‌చదివారు. 1942లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి నియమిత స్వయంసేవక్‌గా, కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. శాస్త్రిగారు చదువుకు విరామం ప్రకటించి ప్రచారక్‌గా వెళ్లారు. ఎనిమిదేళ్లు ప్రచారక్‌గా పనిచేసి, తిరిగి ఉన్నత విద్యను అభ్యసించారు. వీరు స్వర్ణ పతక విజేత. ఆచార్య కేవీ రామనరసింహం పర్యవేక్షణలో ‘తెలుగు సామెతులు – నుడికారాలు’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి డాక్టరేట్‌ ‌పొందారు.ఫెలోషిప్‌పై కేంద్ర ప్రభుత్వంలో మూడేళ్లు పనిచేశారు. బోధన అంటే మక్కువ గల ఆచార్య శాంతమ్మ విజయనగరంలోని ఒక విశ్వవిద్యాలయంలో నేటికీ పాఠాలు చెబుతున్నారు.

శాస్త్రిగారు విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ట్యూటర్‌గా తాత్కాలిక ప్రాతిపదికపై ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి, లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, విభాగాధిపతిగా సేవలు అందించారు. ఆయన పర్యవేక్షణలో అనేక సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి.

వారు ఏకసంథాగ్రాహి. ధారణాశక్తి అమోఘం. విషయాన్ని విశ్లేషణాత్మకగా చెప్పేవారు. పురాణేతిహాసల పట్ల మంచి పట్టున్న ఆయన వివిధ అంశాలపై పెద్ద సంఖ్యలో రచనలు చేశారు. ‘భారతము-భారతీయ భావసమైక్యము’ అనే అంశంపై పరిశోధన పత్రాలు వెలువరించారు. ఉపనిషత్తులు, వేదాలు, పురాణాల గురించి వివరించి చెప్పేవారు.

సంఘమే ఊపిరిగా
కుటుంబ జీవితానికంటే సంఘ కార్యానికి పెద్దపీట వేసే వ్యక్తుల్లో శాస్త్రిగారు ముందు వరుసలో నిలిచారు. వారు చివరి దశలో అనారోగ్యానికి గురై నిలబడలేని స్థితిలో కూడా ప్రతిరోజు ఆటోలో వస్తూ గంటసేపు శాఖలో ఉపస్థితులైన ఆదర్శ స్వయం సేవక్‌. ‌చివరికి శాఖకు రాలేని స్థితిలో మంచానికి పరిమితమైన, అంపశయ్యపై భీష్ముని వలె •పాండవులకు ధర్మసూక్షాలు బోధించినట్లు తఙన దగ్గరకు వచ్చిన కార్యకర్తలకు వారు వెలిబుచ్చిన సందేహాలను బట్టి తగిన మార్గదర్శనం చసిన మహాతపస్వి. విశ్వవిద్యాలయంలో అధ్యాపకత్వాన్ని కొనసాగిస్తూనే, సంఘ కార్యానికి జీవితంలో అత్యధిక కాలం వెచ్చించారు. వృత్తి, ప్రవృత్తుల ప్రభావం ఒకదానిపై ఒకటి పడకుండా సమన్వయంతో నిర్వహించారు.సంఘ కార్యంపై దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో పర్యటించారు. ‘దేశసేవ అంటే జీవితాన్ని వృథా చేయడం కాదు’ అన్న వీరసావర్కర్‌ ‌సూక్తిని ఆచరణలో చూపిన మహోన్నత మూర్తి.

అత్యున్నత వ్యక్తిత్వం
పెద్ద,చిన్న భేదం లేకుండా,నమస్కారానికి ప్రతి నమస్కారంగా రెండు చేతులు జోడించేవారు. మధురంగా,ఆత్మీయంగా మాట్లాడడం, ఒకసారి పరిచయమైన వారిని ఎన్నేళ్ల తరువాతైనా పేరుతో పలకరించేంత జ్ఞాపకశక్తి వారి ప్రత్యేకత. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎవ్వరిని నొప్పించి ఎరుగరు..‘వినదగు నెవ్వరు చెప్పిన…’ అన్నట్లు శ్రద్ధగా ఆలకించి, వారి భావాలను మన్నించేవారు. తన అభిప్రాయాలను ఎదుటివారికి బలవంతంగా ఆపాదించేవారు కాదు.తమకు ఇష్టమైన విషయాలు కాకుండా ఎదుటివారికి నచ్చే వాటిని ముచ్చటించే వారు. ఒకరి లోపాలను మరొకరి వద్ద ప్రస్తావించే వారు కాదు. అవసరమైతే తమ అభి ప్రాయాలను స్పష్టంగా చెప్పేవారు. అనేక విషయాలను ఎంతో సౌమ్యంగా, నొప్పించని రీతిలో చమత్కారంగా వివరించేవారు.

ఎమర్జన్సీలో అరెస్టయినప్పుడు విశాఖ జైలును కూడా విజ్ఞాన నిలయంగా మార్చారు. అక్కడ అనేక అంశాలపై చర్చోపచర్చలు నిర్వహించేవారు. అక్కడి డిటెన్యూ లను పరీక్షించడానికి వచ్చిన కేజీహెచ్‌ ‌వైద్యనిపుణుడు రామయ్య చెట్టి, ‘ఓహో! మీరు ఇక్కడే ఉన్నారా? అయితే..మీరు నరకాన్ని కూడా స్వర్గంగా మార్చగలరు’ (‘Oh, you are here? Then you can make heaven out of hell’) అన్న మాటలు శాస్త్రిగారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి.

‘సమాజం మనకు ఏమి ఇచ్చిందనే దాని కంటే,సమాజానికి మనం ఏమి ఇవ్వగలం?’అని ప్రశ్నించుకోవాలన్నది శాస్త్రిగారి భావన. అలా ‘మానవసేవే మాధవసేవ’గా విశాఖపట్నంలోని స్వగృహాన్ని వివేకానంద మెడికల్‌ ‌ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. తృప్తికి మించిన సంపద లేదనే సూక్తిని అక్షరాల పాటించిన ఆయన నిత్యసంతోషి. ఎదుటి వారికి సుఖాలను తప్ప దుఃఖాన్ని పంచకూడదనే మనస్త్తత్వం. బాధాకరపరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ‘ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నిస్తే, వెంటనే ‘ఎక్స్‌లెంట్‌’ అని బదులు ఇచ్చేవారు.‘అంతబాధలోనూ అలా ఎలా చెప్పారు?’ అంటే ‘వాళ్లకు మాత్రం కష్టాలు ఉండవా? మన కష్టాలు కూడా చెప్పి మళ్లీ వాళ్లను బాధ పెట్టాలా?’ అనేవారు.అనారోగ్యం (నరాల వ్యాధి)తో పడకకే పరిమితమై కూడా, దానిని ‘రాజభోగం’గా తమపై తాము చెణుకులు వేసుకున్న స్థితప్రజ్ఞులు. పైగా తనను చూడవచ్చిన వారి కుటుంబసభ్యుల బాగోగులు వాకబు చేసేవారు. ఎన్నో సంగతులను గుర్తు చేసేవారు. నాటి కార్యవహ, ప్రస్తుత సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌, ‌వారిని చూడడానికి వెళ్లినప్పుడు ‘శ్రీకృష్ణుడు కుచేలుని ఇంటికి వస్తున్నట్లుగా ఉంది’ అన్నారు. దానికి భాగవత్‌జీ ‘కాదు…కాదు…శ్రీకృష్ణుడు సాందీపని ఆశ్రమానికి వచ్చాడు’అని బదులిచ్చారు.

ఆదర్శ గురువు
ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో చదివిన వారు శాస్త్రిగారి శిష్యులమని చెప్పు కోవడం ఉన్నతంగా, అదృష్టంగా భావించేవారు. (ఈ వ్యాసకర్త 1978-80లో వారి వద్ద శిష్యరికం చేశాడు).‘ఏ గురువు శిష్యులకు అన్యాయం చేయడని మా గురువు రామనరసింహం గారు చెబుతుండేవారు’ అనడంలోనే వారి శిష్య వాత్సల్యం వ్యక్తమయ్యేది. అదే సమయంలో వారి క్రమశిక్షణ, సమయపాలన కఠినంగా ఉండేది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ కారు తగిలి ఒక వ్యక్తి గాయపడినప్పుడు, కారు నడుపుచున్న తన అర్ధాంగిపైనే కేసు నమోదు చేయాలని పోలీసులను కోరిన నిజాయతీ వారి సొంతం.

విద్యాయానికి ఆలస్యంగా వెళ్లేవారు కాదు. ఎప్పుడైనా కొద్దిపాటి ఆలస్యంగా వెళ్లినా హాజరు పట్టీలో సంతకం చేసేవారు కాదు. అలా అని ఖాళీగా కూర్చోరు. పరిశోధకులకు సూచనలు చేయడమో, చెప్పబోయే పాఠం గురించి అదనపు సమాచారం సేకరించడమో చేసేవారు. విద్యార్థులు ఆకతాయితనంగా వ్యవహరించినా మందలించక, తమ వ్యవహారశైలితో చక్కదిద్దేవారు.ఉదాహరణకు- ముందు తరగతులు (పీరియడ్‌ల) ఖాళీగా ఉండి, చివరి పీరియడ్‌ ‌వారు చెప్పవలసి వచ్చినప్పుడు, విద్యార్థులు ఉండలేక వెళ్లిపోయిన సందర్భాల్లో ఖాలీ బల్లలకు బోధించేవారు. ఆ తరువాత వీలునుబట్టి అదే పాఠాన్ని విద్యార్థులకు చెప్పేవారు. ఈ వైనం వినడానికి వింతగా అనిపించవచ్చుకానీ, క్రమశిక్షణ, సమయపాలన తరగతి గది నుంచే ప్రారంభం కావాలన్నది శాస్త్రిగారి భావన. కేవలం పాఠ్యాంశాలనే కాకుండా, వ్యక్తిత్వ వికాసాన్ని అన్వయించి చెప్పేవారు.‘రోమ్‌లో రోమన్‌లా ఉండు’ అన్నట్లు వ్యవహరించేవారు. విద్యాలయంలో చదువు గురించి, ఇంటికి వెళితే వ్యక్తిగత అంశాల గురించి ముచ్చటించేవారు. ఆటవిడుపులో పిల్లలతో కలిసి పోయేవారు. ‘మన కాలం మహర్షి’గా మన్నననలు అందుకున్న ఆ మహనీయుడు 81వ ఏట (మే 15,2009)న శివసాయుజ్యం పొందారు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్