
(సెప్టెంబర్ 26 – చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి )
పరపాలకులపై కలం దూసిన కవి. ఎలాంటి ప్రలోభాలకు లొంగని దేశభక్తుడు. భావస్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చిన పాత్రికేయుడు. పత్రిక నిర్వహణకు బ్రిటీష్ ప్రభుత్వం ఇవ్వజూపిన రాయితీలు, ప్రోత్సాహకాలను నిరాకరించిన నిబద్ధతగల పత్రికా రచయిత. అవిటితనం లక్ష్యసాధనకు అవరోధం కాదని నిరూపించిన సాహితీవేత్త.. ఆయనే కవితాకేసరి చిలకమర్తి లక్ష్మీ నరసింహం..సాహిత్య కార్యక్రమాలతో కొద్దో గొప్పో పరిచయం ఉన్న తెలుగువారికి సుపరిచితమైన వాక్యం ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్…ఏదో ఒక సభలో, ఎక్కడో ఒక చోట నిత్యం మార్మోగుతూనే ఉంటుంది. ఈ వాక్యానికి ఇంతగా ప్రాచుర్యం కలిగించిన మూలకర్త, సారస్వతమూర్తి చిలకమర్తి లక్ష్మీనరసింహం.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం నాటకాలు, నవలలు, కథలు ఇతర సాహితీ ప్రక్రియలను సృజించడమే కాదు సాహితీప్రక్రియలను సాంఘీక సంస్కరణల్లో కూడా ముందున్న వ్యక్తి. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం అడుగుజాడల్లో మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన సాహితీవేత్త. బాలికలకు తప్పనిసరిగా విద్య ఉండాలి, మహిళలకు అన్నిరంగాల్లోనూ పెద్దపీట వేయాలని, మహిళాభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గట్టిగా పోరాడిన వ్యక్తి చిలకమర్తి. ఆంగ్లేయుల దోపిడీ, దౌర్జన్యాలను దుయ్యబడుతూ అక్షరాలను అస్త్రాలుగా ప్రయోగించారు. భరత ఖండంబు చక్కని పాడియావు పద్యం ఒక మేలిమి ఉదాహరణ. స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకునేలా సామాన్యులలో స్ఫూర్తినింపింది.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1867 సెప్టెంబర్ 26న పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాల్లో సాగింది. రాజమండ్రి హై స్కూల్ నుంచి పట్టభద్రులు అయిన తర్వాత ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు. తరువాత ఇన్నీసుపేట స్కూల్‌లోనూ, మున్సిపల్ హైస్కూల్‌లోనూ విద్యాబోధన సాగించారు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పని చేశారు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపారు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం హైస్కూల్‌గా మార్చబడింది. 30వ ఏటా నుంచి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపునకు ఉన్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం 20వ శతాబ్ధం ఆరంభం కాలంలో తెలుగువారిలో ఆధునికభావాల వికాసానికి, భాషాభివృద్ధికి కృషి చేశారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి రాకముందే చిలకమర్తివారు హరిజనుల కోసం పాఠశాలను ప్రారంభించారు. బ్రహ్మసమాజం, హితకారిణి సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. దేశమాత అనే వారపత్రిక ద్వారా బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చే బిరుదులకు, ఆదర సత్కారాలకు లొంగని స్వాతంత్ర్య ప్రేమికుడు చిలకమర్తి. బ్రిటీష్ సామ్రాజ్యవాదులు పత్రికలకు పెద్దమొత్తంలో చందాలు ఇచ్చి తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్న సమయంలో ఆ సబ్సిడీని తిరస్కరించి ధనము కోసం బానిసగా ఉండుట ఇష్టం లేదని ప్రకటించారు.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం 100కు పైగా రచనలు గావించారు. కవిగా, నవలా రచయితగా, నాటకకర్తగా, ప్రజా సేవకుడిగా, సంఘసంస్కర్తగా ఆంధ్రదేశానికి ఎనలేని సేవలు అందించారు. ముఖ్యంగా ఆయన నాటక రచనలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. తెల్లవారి దురాగతాలను తేటతెలుగులో చెప్పి దేశభక్తిని చాటుకున్నారు. తెలుగువారి హృదయాల్లో ఆత్మగౌరవాన్ని నిరంతరం నింపుతూ చిరస్థాయిగా సుప్రతిష్ఠులయ్యారు.



