News

72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

189views

భారతీయ జనసంఘ్‌ సహ వ్యవస్థాపకులు పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఢిల్ల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన 72 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం మోదీ మాట్లాడారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్‌ జీవితం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పేదలు, అట్టడుగు వర్గాల పట్ల కరుణతో సేవ చేయాలనే ఆయన సందేశం ప్రతిఒక్కరికీ మార్గదర్శనీయమన్నారు. రాజకీయాల్లో మహిళలకు సముచితమైన భాగస్వామ్యం లేకుండా సమ్మిళిత సమాజం, ప్రజాస్వామిక సమైక్యత గురించి మాట్లాడలేమన్నారు.

పెద్ద లక్ష్యాలను పెట్టుకొని వాటి కోసం కృషి చేసేటప్పుడు, ప్రతిఒక్కరితో కలిసి ముందుకెళితే మన విజయాల స్థాయి కూడా పెరుగుతుందని మోదీ అన్నారు. వ్యక్తిగత విజయం కంటే ప్రజా విజయమే ఎల్లప్పుడూ గర్వించేలా చేస్తుందని తెలిపారు. ఈరోజు భారత్‌ తన కృషితో ఇమేజ్‌ను మార్చుకోవడంతో విదేశాల్లో సాధారణ భారతీయుడిని సైతం గౌరవంగా చూస్తున్నారన్నారు. చంద్రయాన్‌ -3 విజయవంతమైన తర్వాత సామాన్య భారతీయుడిని ప్రపంచ దేశాల ప్రజలు అభినందిస్తున్నారన్నారు. జీ20 సదస్సు తర్వాత కూడా మన దేశాన్ని ప్రశంసిస్తున్న తీరు ప్రతి భారతీయుడి గౌరవాన్ని పెంచిందని మోదీ అన్నారు. దీన్ దయాళ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.