
ఆధునిక యుగంలో భారత్ వెలుపల విదేశాల్లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభానికి సిద్దమైంది. న్యూజెర్సీలో నిర్మితమైన ఈ దేవాలయాన్ని అక్టోబర్ 8న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు దర్శించుకుంటున్నారు. 2011లో రాబిన్స్ విల్లే టౌన్ షిప్ లో ప్రారంభం అయిన నిర్మాణ పనులు 12 ఏళ్ల అనంతరం 2023లో పూర్తయ్యాయి. 183 ఎకరాల్లో అక్షర్ ధాం పేరుతో నిర్మితం అయిన ఈ ఆలయంలో మొత్తం 10వేల విగ్రహాలు, శిల్పాలు ఉంటాయని అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని అక్షర్ ధాంలో చూడవచ్చు. బ్రహ్మకుండ్ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా ౩౦౦ నదులు నుంచి సేకరించిన జలాలను అందుబాటులో ఉంచడం విశేషం. దశాబ్ద కాలంగా సాగిన ఈ ఆలయ నిర్మాణానికి లక్షల మంది వాలంటీర్లు తమ సహాయ సహకారాలు అందజేశారని బీఏపీఎస్ స్వామి నారాయణ్ సంస్దకు చెందిన అక్షర్ వత్సల్ దాస్ స్వామి వెల్లడించారు.





