News

కన్నుల పండువగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

376views

నారసింహుని క్షేత్రాల్లో అగ్రగామిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కల్యాణోత్సవ శోభతో కళకళలాడింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ సకల దేవతల ఆశీర్వచనాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిలను మంగళవారం రాత్రి స్వామి వారు పరిణయమాడారు. వైఖానస ఆగమానుసారం, వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యుడు వింజమూరి రామలింగాచార్యులు, ప్రధాన అర్చకుడు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి సమక్షంలో అర్చకులు, పేరూరు ఉద్దండ పండితులు కల్యాణ తంతు నిర్వహించగా భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. స్వామివారి కల్యాణం మంగళవారం రాత్రి 12.46 గంటలకు రోహిణీ నక్షత్రయుక్త తులా లగ్న పుష్కరాంశమందు అంగరంగ వైభవంగా జరిగింది. శుభ ముహూర్తానికి జీలకర్ర, బెల్లంను స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌… శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల శిరస్సులపై సహాయ అర్చకులు ఉంచారు. ఆలయం ముందు నిర్మించిన శాశ్వత షెడ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశీనులై కల్యాణాన్ని వీక్షించారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఎదురు సన్నాహంతో కల్యాణ తంతు ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబరు రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్‌ శ్రీవారి తరపున, అర్చకస్వాములు అమ్మవారి తరపున వివాహకర్తలుగా వ్యవహరించారు.

ఆలయం నుంచి తొలుత స్వామివారిని, తర్వాత అమ్మవార్లను వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అర్చకులు, అధికారులు పల్లకీల్లో వేర్వేరుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. శ్రీవారు, అమ్మవార్లకు అంతర్వేదికరకు చెందిన డాక్టర్‌ పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ కుటుంబీకులు గతంలో ఇచ్చిన ఆభరణాలను అర్చకులు అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం పేరూరు ఉద్దండ పండితులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. తలంబ్రాలను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పొలమూరి కుటుంబీకులు తీసుకువచ్చారు. కల్యాణానికి ముందు దేవస్థానం తరపున అధికారులు, ప్రభుత్వ ప్రతినిధిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మొగల్తూరు రాజా, ఆలయ ఫౌండర్‌ మెంబర్‌ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్‌, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు, ఆలయ అధికారులు, భక్తులు శ్రీస్వామి, అమ్మవార్లకు మధు పర్కాలు సమర్పించారు.