News

బొట్టు, గోరింటాకు పెట్టుకున్నందుకు విద్యార్థినులకు జరిమానా… వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం! కర్నూల్‌లో ఘటన!

349views

కర్నూలు డీఎంహెచ్ కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా కల్పించారు. ఈ కోర్సుకు ప్రిన్సిపల్‌ మరియు హాస్టల్‌ వార్డెన్‌గా విజయ సుశీల అనే మహిళ వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులు కొందరు బొట్టు, గోరింటాకు పెట్టుకుంటున్నారని.. వారికి విజయ సుశీల జరిమానా విధిస్తోంది. దీంతోపాటు వారిని పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తోంది. తను చెప్పినట్లు చేయకపోతే ఫెయిల్‌ చేస్తానని బెదిరించేది. ఆమె వికృత చేష్టలకు విసిగిపోయిన ఇద్దరు విద్యార్థినులు శనివారం ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇద్దరు యువతులు ఫ్యాన్ కు ఉరేసుకునేందుకు యత్నించగా.. తోటి విద్యార్థులు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం బాధితులు సోమవారం తమ సమస్యను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మీనర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజయ సుశీలను పిలిపించి వసతి గృహంలో ఉండకూడదని.. ఇల్లు చూసుకోవాలని తేల్చి చెప్పారు. ఇక తనపై ఫిర్యాదు చేయడంతో విజయ సుశీల ఆగ్రహించింది.

విద్యార్థినుల గతంలో వారు పర్సనల్‌గా దాచుకున్న ఉత్తరాలను అప్పట్లోనే తీసుకున్న సుశీల.. ఆయా లేఖలను బూచిగా చూపి తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించింది. దీంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిలో ఓ యువతి మంగళవారం మళ్లీ బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అధికారులు సెలవులిచ్చి విద్యార్థినులందరినీ ఇంటికి పంపేశారు. కేవలం బొట్టు, గోరింటాకు పెట్టుకుంటున్నారన్న కారణంతో విజయ సుశీల విద్యార్థినులను మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం, వేధింపులకు పాల్పడటం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. శిక్షణ కేంద్రాలు.. విద్యని పంచాలే తప్పా.. ఇలా హిందూ మతాచారాలను కించపరిచేలా చేయకూడదని చెబుతున్నారు.