
యానాంలోని శ్రీదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం పునఃనిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ నేపధ్యంలో త్వరలో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, టీటీడీ సభ్యుడు మల్లాడి కృష్ణారావు తెలిపారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం జరిగిన ఎస్టేట్ కమిటీ సమావేశంలో పుదుచ్చేరి, యానానికి సంబంధించిన రెండు ప్రధాన అంశాలపై చర్చ జరిగిందన్నారు. యానాం వెంకన్న ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పుదుచ్చేరి ప్రభుత్వం నూతన పాలకమండలితోపాటు నిర్మాణ కమిటీ నియమించిందన్నారు. దీంతో పాటు 664 మీటర్ల మున్సిపాల్టీ భూమిని దేవస్థానానికి బదీలిచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేయడంతో నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు గతంలో నిర్ణయం తీసుకుందన్నారు. నిర్మాణ పనులకు మొత్తం రూ.10 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికి రూ.1.27కోట్లతో పునాది వరకు నిర్మాణం పూర్తయిందన్నారు. మరోవైపు దాతలు, భక్తుల సహకారంతో సేకరించిన రూ.2.71కోట్ల చెక్కును ఈవో ధర్మారెడ్డికి మంగళవారం అందజేసినట్టు మల్లాడి తెలిపారు. దీనికి తోడు టీటీడీ రూ.3కోట్లు ఇవ్వనుందన్నారు. ఈ నగదుతో శ్రీవారి గర్భాలయం, అమ్మవారి గుడి, గాలిగోపురం నిర్మాణ పనులు త్వరలో టీటీడీ ప్రారంభిస్తుందన్నారు.





