News

గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం!

357views

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలల వద్ద భద్రతా బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు ఐదంచెల భద్రత కల్పించారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ భద్రత ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, ఈ నెల 24, 25, 26వ తేదీల్లో మాత్రం ఏడంచెల భద్రత అమలు చేయనున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. ఈ కారణంగా విదేశాలకు వెళ్ళే ప్రయాణికులు మూడున్నర గంటలు, స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాల్సిందేనని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ద్రవపదార్థాలు, ఊరగాయలు, హల్వా, జామ్‌, నూనె వంటివి ప్రయాణికులు తమ వెంట తీసుకురాకుండా నిషేధం విధించారు. పొరపాటున వాటిని తీసుకెళ్ళినా భద్రతా సిబ్బంది మాత్రం లోనికి అనుమతించరు. ప్రస్తుతం విమానాశ్రయాలో మూడు నుంచి ఏడు అంచెల భద్రత అమలు చేస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు, ఇక్కడకు వచ్చివెళ్ళే ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే, విమాన ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా చెక్‌ చేస్తున్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరికొన్నింటిని కూడా అమర్చి, కంట్రోల్‌ రూం నిశితంగా పరిశీలిస్తున్నారు.