
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించారు అన్న వ్యవహరం కలకలం రేపుతోంది. నిత్యం పటిష్ట భద్రత నడుమ ఉండే ఆలయ పరిసరాలను ఎవరో డ్రోన్‌తో చిత్రీకరించిన విజువల్స్ సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో టీటీడీ అధికారులు స్పందించారు. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ, సెక్యూరిటీ అధికారులు.. ఆ విజువల్స్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపేందుకు సిద్ధమవుతున్నారు. యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం.
ఈ వీడియో ఇటీవల తీసింది కాదని.. పాత వీడియో కావొచ్చు అని అన్నారు. వీడియో ఎప్పుడు తీసినా శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాల సాయంతో ఏరియల్ వ్యూలో చిత్రీకరించడం నిషేధం కాబట్టి విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో ఎప్పటిదైనా సరే నేరమే.. అందుకే సోషల్ మీడియాలో పోస్టుచేసిన వారిపై.. యూట్యూబ్ ఛానెళ్లలో పెట్టినవారిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తిరుమల శ్రీవారు కొలువైన కొండపైన ‘నో ఫ్లై జోన్’గా ఉంది. ఆ కొండ పైనుంచి విమానాలు, హెలికాప్టర్లకు ఎగిరేందుకు అనుమతి ఉండదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతి లేదు. అయితే ఉన్నట్టుండి తిరుమల దేవాలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట ఈ వీడియో ఎలా రికార్డ్ చేశారన్నది చర్చనీయాంశమైంది.
స్పందించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..
ఈ వీడియో వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధమని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోపై విచారణ జరుగుతోందన్నారు. విజువల్స్ అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించామని.. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. కుట్ర కోణంతో టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో వాస్తవాలను భక్తుల ముందుకు ఉంచుతామన్నారు ఆయన వివరించారు.





