
కర్ణాటక రాష్ట్రాన్ని పాలించిన ఇతర పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కర్ణాటకలోని కోడెకల్‌లో నీటిపారుదల, తాగునీరు, జాతీయ రహదారికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
కర్ణాటకలో(Karnataka) మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీజేపీ సిద్ధమై మొత్తం 224 సీట్లకు గానూ కనీసం 150 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబుల్ ఇంజన్ సర్కార్‌పై ప్రధాని దృష్టి పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లపాటు కొత్త తీర్మానాలను నెరవేర్చేందుకు దేశం ముందుకు సాగుతోందని అన్నారు. ఈ 25 ఏళ్లు దేశంలోని ప్రతి ఒక్కరికీ అమృతం అని ఆయన అన్నారు. ఒక్కో రాష్ట్రానికి అమృత్ కాల్ ఉంది. అమృత్ కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి రాష్ట్రం ఈ ప్రచారానికి సహకరించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. పొలంలో పనిచేసే రైతు, పరిశ్రమల్లో పనిచేసే కూలీలు అందరి జీవితాలు బాగున్నప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది.
స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు సాగే ప్రయాణాన్ని అమృత్‌కాల్‌గా ప్రధాని తరచుగా పిలుస్తుంటారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ కాలంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ నెలలో మోదీ కర్ణాటకలో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు హుబ్బళ్లి వచ్చిన ఆయన ఈ సందర్భంగా రోడ్ షో కూడా చేశారు.





