
కేంద్ర ప్రభుత్వం త్వరలో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే అవకాశం ఉంది. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించాలంటూ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో పేర్కొంది. అదే సమయంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి సమావేశం కూడా నిర్వహించిందని సుబ్రమణ్యస్వామి కోర్టుకు తెలిపారు. ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖకు ఇప్పటికే పలు లేఖలు పంపామని సుబ్రమణ్యస్వామి అన్నారు. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. రామసేతును చారిత్రక కట్టడంగా గుర్తించాలంటూ సుబ్రమణ్యస్వామి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది హిందువుల విశ్వాసంతో రామసేతు ముడిపడి ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని కారణంగా అది విచ్ఛిన్నం కాకూడదని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు రామసేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే ఫిబ్రవరి మొదటి వారం నాటికి కేంద్రం నుంచి ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు.





