బడ్జెట్ ప్రకటనకు ముందే గరిట పట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎందుకో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Union Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో దీనికి ముందుగానే హల్వా వేడుకను నిర్వహిస్తారు. అసలు బడ్జెట్‌కు ముందు నిర్వహించే ఈ హల్వా వేడుక (Halwa Ceremony) ప్రత్యేకత ఏమిటి.. ? ఏటా ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకుందామా మరి..
వేడుక చేసేది ఇందుకే..
ఏ పనైనా విజయవంతంగా పూర్తయితే మనం ఆనందపడతాం. ఆ సంతోషాన్ని వివిధ రకాలుగా పంచుకుంటాం. అందులో భాగంగానే నోరు తీపి చేసుకుంటాం. అలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సంబంధించి కూడా హల్వా కార్యక్రమం జరుగుతుంటుంది. బడ్జెట్ రూపకల్పన అనంతరం శుభానికి సూచికగా ఈ మిఠాయిని సిద్ధం చేస్తుంటారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ హల్వాను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.
బడ్జెట్ రూపకల్పనలో పాత్ర వహించిన అధికారులు ఈ వేడుకలో పాల్గొంటారు. వీరి కృషికి మెచ్చి కృతజ్ఞతతో ఈ మిఠాయిని అందిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతి ఒక్కరికీ ఈ మిఠాయిని పంచుతారు. ఓ భారీ కడాయిలో ఈ హల్వాను తయారు చేస్తుంటారు. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో ఈ వేడుక జరుగుతుంటుంది. అయితే, గతేడాది హల్వా వేడుకను నిర్వహించలేదు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేశారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మిఠాయిలు మాత్రమే పంపిణీ చేశారు.
10 రోజుల ముందే వేడుక..
సాధారణంగా హల్వా కార్యక్రమం బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీకి 10 రోజులు ముందు జరుగుతుంటుంది. ఈ వేడుక పూర్తయ్యాక బడ్జెట్ పత్రాలను ప్రింట్ చేయడం ప్రారంభిస్తారు. బడ్జెట్ రూపకల్పన అనంతరం అదే నార్త్ బ్లాక్‌లోని ‘బడ్జెట్ ప్రెస్’ హాలులో బడ్జెట్ పత్రాల ముద్రణ చేస్తారు. ఈ సమయంలో అధికారులను బయటికి పంపించరు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వరకు వీరి లోపలే ఉంటారు. కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదు. బడ్జెట్ విశేషాలను రహస్యంగా ఉంచడానికే ఇలా చేస్తుంటారు.





