News

ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

336views

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నాలుగు రోజులపాటు దుబాయిలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా దుబాయిలోని తెలుగు అసోసియేషన్‌ భారత కాన్సులేట్ జనరల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ కుమార్… వెంకయ్య నాయుడిని సాధరంగా ఆహ్వానించి స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా దుబాయిలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి దేశానికి వెంకయ్య నాయుడు చేసిన సేవలను కొనయాడారు.

కార్యక్రమంలో భాగంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. జన్మభూమి, చదువుచెప్పిన గురువులను ఎప్పుడు మరిచిపోకూడదని, మనిషికి మాతృభాష కళ్ళవంటిదని అన్నారు. ఇతర భాషలు కళ్ళజోడు వంటివని, మాతృభాషను, మన కట్టు, బొట్టు, ప్రాస, యాస, గోసలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. భారతదేశంలో మన వేద పురాణ కాలం నుంచే మహిళకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ పిలిపునిచ్చినట్టుగా ఆడపిల్లలను సంరక్షించాలని, చదివించాలని, ప్రోత్సాహించాలని కోరారు. యూ.ఏ.ఈ లోని ఉభయ రాష్ట్రాల తెలుగు వారిని సంఘటిత పరుస్తూ, తెలుగు సంస్కృతిని సంరక్షిస్తున్న తెలుగు అసోసియేషన్ సేవలను వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

ప్రపంచం శరవేగంతో ముందుకు వెళ్తోందని, మన భారతదేశం నైపుణ్యతకు, మేధస్సు, నిజాయితీలకు మారుపేరని అన్నారు. సంకల్పం, దృఢ నిశ్చయం, పట్టుదల, కఠోర శ్రమతో విశ్వగురువుగా దేశం అవతరించబోతోందని జోస్యం చెప్పారు. సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానికరంగాల్లో భారత్‌దే పైచేయి అని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెప్పారు. మన పూర్వ వృత్తాంతాన్ని మననం చేసుకుంటూ, మన మూలాలను మరవకుండా, మనుగడను కొనసాగించి పురోభివృద్ధి చెందాలని కోరారు. ప్రతీ ఒక్కరూ తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలని తెలిపారు. అనంతరం తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వెంకయ్యనాయుడుని సన్మానించి, సన్మాన పత్రం, శాలువా, జ్ఞాపికలను బహూకరించారు.