ఈ ఏడాది జి-20 సమావేశాలకు భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. దిల్లీలో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, పర్యాటకులు ఇండియాకు రానున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలకు నేతృత్వం వహిస్తున్న భారతదేశం అందుకు తగ్గట్లుగానే ఈ సమావేశాల నిర్వహణకు ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్న సందర్భంగా తన పరిధిలోని మూడు శాఖలతో సన్నాహాలు గురించి ఆయన సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి జి-20 షెర్పా అమితాబ్ కాంత్, జి-20 సెక్రటేరియట్ అధికారులు, మూడు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటంపై కూడా దృష్టి..
ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు కూడా తమ రాష్ట్రాల్లో సన్నద్ధతను సమావేశంలో వివరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకం, అక్కడి సాంస్కృతిక వైవిధ్యతకు అవసరమైన గుర్తింపును అందించేందుకు జీ-20 సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖలకు సంబంధించిన, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న జీ-20 సమావేశాల్లో ప్రజల భాగస్వామ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆధునిక వసతులతోపాటు, ప్రతి చోటా భారతీయత ప్రతిబింబించేలా కార్యక్రమాలుండాలని ఆయన సూచించారు.
పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం..
జీ-20 దేశాల ప్రతినిధులు, అధికారులు పాల్గొనే వర్కింగ్ గ్రూప్స్ సమావేశాలు జరిగే ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లు, ఆ కేంద్రాల వద్ద సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలకు సంబంధించి అధికారులు ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి, జీ-20 షెర్పాకు వివరించారు. అటు పర్యాటక శాఖ అధికారులు కూడా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగే ప్రాంతాల్లో అతిథుల కోసం చేపడుతున్న ప్రత్యేక ఏర్పాట్లు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. జీ-20 సమావేశాల మొదటి విడత కార్యక్రమాలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ దిశగా చేపడుతున్న ఏర్పాట్లపై కూడా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.