
-
మాజీ ఎంపీ నారాయణరావు
మచిలీపట్నం: సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలు ఉన్నాయని హిందూ కాలేజీ అనుబంధ సంఘాల అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు అన్నారు.
సహస్ర గళ సంపూర్ణ భగవద్గీతా పారాయణ కరపత్రాలను శనివారం నిర్వాహకులు కొనకళ్ళ నారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇక్కడి హిందూ కాలేజీ గ్రౌండ్స్ లో రేపు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే సహస్ర గళ సంపూర్ణ భగవద్గీతా పారాయణ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి సమక్షంలో జరుగుతుందన్నారు.

భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతుందని, సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము భగవద్గీత అని అన్నారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగములు బోధింపబడినవి అన్నారు. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు, పాప హరణకు మార్గమని అన్నారు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులోని ముఖ్యాంశములు అని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించి భగవద్గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను నారాయణ పిలుపునిచ్చారు. మహోన్నతమైన సహస్ర గళ సంపూర్ణ భగవద్గీతా పారాయణ భారతదేశంలోనే తొలిసారిగా మచిలీపట్నం హిందూ కాలేజీ గ్రౌండ్స్ లో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నిర్వహించడం మన అందరి అదృష్టమని, అలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు, పివి ఫణి కుమార్, కాపవరపు చంద్రశేఖర్, తమ్మన వెంకట సుబ్బారావు, మల్లాది బుద్దేశ్వర రావు, కాపవరపు ప్రసాదు, ఎం. శ్రీనివాసు, తాళ్లూరి శోభ, కందప్ప శివరామకృష్ణ శర్మ, కే యం గాంధీ, దైత శ్రీనివాస శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.





