News

తమిళనాడులో మూడు చోట్లే ఆర్ఎస్ఎస్ పథసంచలన్‌కు అనుమతి!

416views

చెన్నై: తమిళనాడులో 50 చోట్ల ఈ నెల ఆరోతేదీన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన పథసంచలన్‌(కవాతు)అనుమతి ఇవ్వమని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర పోలీసులు మాత్రం మూడు చోట్ల మాత్రమే అనుమతి ఇచ్చారు. మరో 23 చోట్ల బహిరంగ మైదానంలో కాకుండా హాల్‌లలో నిర్వహిస్తే అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక మిగిలిన 24 చోట్ల అసలు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.

దానితో మిగిలిన చోట్ల ఎందుకు అనుమతి ఇవ్వలేదో హోమ్ శాఖ నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. హోంశాఖ నివేదిక పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మద్రాసు హైకోర్టు పేర్కొంది.

రాష్ట్రంలో అక్టోబరు రెండోతేదీన తేదీ నిర్వహించే ఆర్‌ఎస్ఎస్‌ కవాతుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సుమారు 50కి పైగా పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిని విచారించిన న్యాయస్థానం, ఈ నెల ఆరోతేదీ కవాతుకు నిబంధనలతో కూడిన అనుమతులివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో, ఈ పిటిషన్‌ విచారణ మళ్ళీ బుధవారం విచారణకు రాగా, పిటిషన్‌దారుల తరఫున హాజరైన న్యాయవాది, రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించాలని దరఖాస్తు చేసుకోగా, కడలూరు, పెరంబలూరు, కళ్లకుర్చి ప్రాంతాల్లో మాత్రమే అనుమతించారని, మిగిలిన ప్రాంతాల అనుమతికి హోంశాఖ హెచ్చరికలున్నాయని పోలీసులు చెప్పినట్టు తెలిపారు.

ఈ విషయమై ఎందుకు అనుమతివ్వలేదని న్యాయమూర్తి ఇళందిరైయన్‌ పోలీసులను ప్రశ్నించగా, ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతివ్వాలని సెప్టెంబరు 30వ తేదీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మూడు ప్రాంతాల్లో మాత్రమే అనుమతించినట్టు పేర్కొన్నారు. అందుకు నిఘా వర్గాల నివేదికలు సహితం కారణంగా పేర్కొన్నారు.

అందుకు స్పందించిన న్యాయమూర్తి, హోంశాఖ నివేదిక పరిశీలించిన తర్వాత మిగిలిన 47 ప్రాంతాల్లో ప్రదర్శనకు అనుమతించాలా, వద్దా అని వెల్లడిస్తామంటూ, తదుపరి విచారణ ఈ నెల నాలుగోతేదీకి వాయిదా వేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి