
విజయవాడ: దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు, అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరోతేదీ ఆదివారం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ జాతీయ కన్వీనర్ కె.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఇక్కడి బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
1917 నవంబర్ 9, 5 ,6 తేదీలలో విజయవాడ కృష్ణా నది తీరాన గల ప్రముఖులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్య దేవర కాళేశ్వరరావు వంటి పెద్దలు అస్పృశ్యత నిర్మూలన కోసం “ఆది ఆంధ్ర మహాసమ్మేళనం” నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎస్సీ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ ఈ సభకు అధ్యక్షత వహించారు. అస్పృశ్యత అంటరానితనం గురవుతున్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలకు అనేక తీర్మానాలు చేశారు. ఆ సభల స్ఫూర్తితో 105 ఏళ్ళలో సామాజిక సమతా దిశలో అనేకమంది పనిచేశారని శ్యాంప్రసాద్ వివరించారు.
72 ఏళ్ళుగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా దేశం అనేక అడుగులు ముందుకు పడినా ఆశించిన స్థాయిలో మార్పులు రాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరోతేదీన “సామరసత సమ్మేళనం” నిర్వహిస్తున్నామని చెప్పారు.
డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగే ఈ సమ్మేళనంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సి.నారాయణస్వామి, పూజ్యశ్రీ కమలానంద భారత స్వామీజీ, ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ సునీల్ అంబేకర్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు, మాజీ మంత్రులు మండలి బుద్ధ ప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్, తదితరులు పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వేముల కూర్మయ్య భాగ్యరెడ్డి వర్మ కుటుంబీకులకు సత్కారించనున్నట్టు శ్యాం ప్రసాద్ వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి శ్రీ విష్ణు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.





