
టొరంటో: కెనడాలో ప్రఖ్యాత స్వామి నారాయణ్ హిందూ దేవాలయాన్ని కెనడా ఖలీస్థాన్ తీవ్రవాదులు అపవిత్రం చేసి ధ్వంసం చేయడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. టొరంటోలో జరిగిన ఘటనను కెనడాలోని భారత దౌత్య కార్యాలయ వర్గాలు తీవ్రంగా గర్హించాయి. ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను దౌత్యాధికారులు కోరారు.
టొరంటోలోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్‌పై ఎప్పుడు దాడి జరిగిందనేది నిర్థిష్టంగా తెలియలేదు. అయితే ఈ ఘటనపై భారత హైకమిషన్ ట్వీటు వెలువరించిన విషయం విదితమే. ఈ అంశంపై స్థానిక ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపింది. ఈ సంఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశారు. విద్వేషాన్ని వ్యాపింపజేయడం కోసమే ఇటువంటి దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనను భారత హై కమీషన్ కెనడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మందిరాన్ని అపవిత్రం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఓ ట్వీట్‌లో తెలిపింది.
Source: Nijamtoday





