News

తెలంగాణ : జాతీయ సమైక్యతా ర్యాలీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత

377views

* ఇద్దరి పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో సుమారు 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో విద్యార్థులు డీహైడ్రేషన్ ‌కు గురై కిందపడిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో సుమారు 20మందికి కింద పడిపోయిన చోటే ప్రాథమిక చికిత్స అందించగా కోలుకున్నారు. మరో 10మందిని మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 10గంటలకు ర్యాలీ ప్రారంభం సందర్భంగా సుమారు 5వేల మంది విద్యార్థులను పిలిపించారు. అక్కడి నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో విద్యార్థుల కోసం ఎలాంటి షామియానాలు గాని, తాగునీటి సదుపాయం గాని ఏర్పాటు చేయలేదు. దాంతో పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పిల్లలకు ఎలాంటి సదుపాయాలూ కల్పించకుండా ర్యాలీ పేరుతో ఎండలో నడిపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు తల్లిదండ్రులు బహిరంగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ను, స్థానిక టీ ఆర్ ఎస్ నాయకులను దుయ్యబట్టడం కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.