News

సహజీవనాలు, విడాకులు పెరగడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన

364views

తిరువ‌నంత‌పురం: లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌గా పిలుచుకొనే సహజీవనాలు, స్వల్పమైన, స్వార్థపూరిత కారణాలతో విడాకులు కోరడం వంటి పరిస్థితులు ఎక్కువ కావడం పట్ల కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో వివాహ బంధాలపై వినిమయ వస్తు సంస్కృతి ప్రభావం అధికంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

వస్తువులను వినియోగించి..అనంతరం పారవేసే ‘యూజ్‌ అండ్‌ త్రో’ విధానాన్ని అవలంబిస్తున్నారని విచారం వ్యక్తం చేసింది. తొమ్మిదేళ్లపాటు కాపురం చేసి, ముగ్గురు పిల్లలు కలిగిన అనంతరం ఓ వ్యక్తి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య తనను వేధింపులకు గురి చేస్తోందని, అందువల్ల విడాకులు మంజూరు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

దానిని ఆ కోర్టు తిరస్కరించింది. అనంతరం ఆయన హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.ముహమద్‌ ముస్తాకీ, జస్టిస్‌ సోఫీ థామ్‌సల ధర్మాసనం పరిశీలించింది. ఆ వ్యక్తి చేసిన వినతిని కొట్టి వేస్తూ కుటుంబ సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘నేటి తరం పెళ్లిని ఓ కీడుగా భావిస్తోంది .బాధ్యతలు, జవాబుదారీతనం లేకుండా స్వేచ్ఛగా జీవించడానికి అదొక ఆటంకమని అనుకుంటోంది. వైఫ్‌- డబ్ల్యు ఐ వై ఎఫ్‌- అంటే ‘వర్రీ ఇన్‌వైటెడ్‌ ఫర్‌ ఎవర్‌’ అని అర్థం చెప్పుకొంటోంది” అంటూ ప్రస్తుత పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి