
* భారతీయత ఉట్టిపడేలా నావికాదళానికి సరికొత్త చిహ్నం
భారత నావికా దళానికి సరికొత్త చిహ్నాన్ని (నిషాన్) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఆవిష్కరించారు. కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ కొత్త గుర్తుతో ఉన్న పతాకాన్ని ప్రధాని ఎగురవేశారు.
నౌకాదళానికి ఇప్పటివరకు ఉన్న గుర్తు.. దేశ వలసవాద గతాన్ని గుర్తుచేసేలా ఉందని కేంద్రం భావించింది. దీన్ని మార్చి.. మన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందేలా ఉండే కొత్త చిహ్నానికి రూపకల్పన చేశారు. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ ‘నిషాన్’లో అనేక ప్రత్యేకతలున్నాయి.
* నౌకాదళం కొత్త చిహ్నంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఎడమవైపు పైభాగంలో మన జాతీయ పతాకాన్ని ఉంచారు. ఇక రెండోది నీలం, బంగారు వర్ణంలో అష్టభుజాకారంలో ఉన్న చిహ్నం.
* ఈ అష్టభుజాకార చిహ్నంలో రెండు బంగారు వర్ణ బోర్డర్లు.. నీలం రంగు మధ్యలో జాతీయ చిహ్నం ఉంది. దాని కిందనే ‘సత్యమేవ జయతే’ అనే అక్షరాలను దేవనాగరి లిపిలో నీలం రంగులో రాశారు. ఈ జాతీయ చిహ్నం.. నౌక యాంకర్ ఆకృతిపై నిల్చున్నట్లుగా ఉంది. ఈ రెండింటి కింద భారత నౌకాదళ నినాదం ‘సమ్ నో వరుణః’ అని దేవనాగరి లిపిలో బంగారు వర్ణంలో రాసి ఉంది. దీని అర్థం.. వరుణదేవుడా మాకు అంతా శుభం కలుగుగాక అని.
* ఈ అష్టభుజాకారం.. నౌకాదళ బహుళ దిశల పరిధి, బహుళ కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. యాంకర్ చిహ్నం ‘స్థిరత్వాని’కి గుర్తుగా రూపొందించారు. నీలం రంగు నావికాదళ సముద్ర సామర్థ్యానికి ప్రతీకగా నిలవనుంది.
* ఇక, అష్టభుజాకారం చుట్టూ ఉన్న రెండు బంగారు రంగు బోర్డర్లు.. శివాజీ మహరాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. సముద్ర జలాలు, తీరాలపై అత్యంత దార్శనికత కలిగిన భారత రాజుల్లో శివాజీ మహరాజ్ ఒకరు. ఆయన హయాంలో అత్యంత విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఇందులో 60 ‘యుద్ధ నౌకలు’, దాదాపు 5వేల మంది సైన్యం ఉండేవారని నేవీ ఓ వీడియోలో తెలిపింది. గతంలో భారత తీర రక్షణలో ఈ దళం అత్యంత కీలకంగా పనిచేసింది.
* ఇక నేవీ పతాకంలోని తెలుపు రంగు భారత నౌకాదళ ప్రస్తుత సామర్థ్యాలను, నిర్మాణాలు, నౌకలను ప్రతిబింబిస్తుంది.