
“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్నట్లుగా జనని, జన్మభూమి స్వర్గం కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా అమ్మ అంత ప్రియమైనది, అమ్మ చేతి ముద్ద అంత రుచియైనది, అమ్మ ఒడి అంత వెచ్చనిది, భద్రమైనది.
ఎన్ని భాషలు నేర్చిన వారైనా ఎదురుదెబ్బ తగిలితే అమ్మా అని మాతృభాషలోనే ఆర్తనాదం చేస్తారు. అంతెందుకు మదిలో మెదిలే ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి కదా? మాతృభాషలో మన ఆచార సాంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. సామెతలు, చతురత నిండిన హాస్యోక్తులు అనేకం ఉంటాయి. వాటి వెనుక ఒక జాతి జీవన విధానం ఇమిడి ఉంటుంది.
చారిత్రక గాథలు, ఇతిహాసాలు, జానపదాలు వ్యక్తులలో చారిత్రక అవగాహనను, శౌర్య పరాక్రమాలను, సంస్కారాలను, స్వాభిమానాన్ని నింపుతాయి. అవన్నీ మాతృభాషలో లభించే సాహిత్యంలోనూ, వినిపించే గేయాల్లోనూ, హరికథలు బుర్ర కథల రూపంలోనూ పొందాల్సిందే. ఒకే భాషలో ఉండే వివిధ మాండలికాలు ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. జీవన రీతులను కళ్లకు కడతాయి.
అయితే దురదృష్టవశాత్తూ విదేశీ భాషల ప్రభావంతో మన మాతృభాష తెలుగు మృత భాషగా మారిపోతోంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బాల బాలికలు తెలుగులో మాట్లాడడమే నేరంగా పరిగణించబడుతోంది. పాఠశాలల్లో మాతృభాషలో మాట్లాడిన చిన్నారులకు శిక్షలు విధిస్తున్నారు. విద్యాధికారులు, ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఆంగ్ల భాషా వ్యామోహంతో తల్లిదండ్రులు కూడా పాఠశాలల వింత పోకడలకు వంత పాడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ తెలుగును కేవలం ఒక సబ్జెక్టుగా మాత్రమే చూస్తున్నారు.
భాష సరళీకరణ పేరుతో భాషా శాస్త్రవేత్తలు కొందరు తెలుగు భాషలోని చాలా అక్షరాలను, పదాలను యథేచ్ఛగా తొలగించారు. దీని కారణంగా నేటితరం తమ మాతృభాషపై పట్టు కోల్పోయింది. ఈ స్థితి మారాలి. పాఠశాలలలో మన మాతృభాష తెలుగుకు అవమానం తగదు. అందరం మాతృభాషలోనే మాట్లాడాలి. మాతృ భాషను అధ్యయనం చేయాలి. వాంగ్మయాన్ని చదవాలి. పిల్లలకు చిన్నతనంలోనే వీటన్నిటినీ పరిచయం చేయాలి.
కాశీ మజిలీ కథలు, భోజరాజు కథలు, బేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు లాంటివెన్నో. వాటిలో భాషా పాండిత్యం ఉంది, నీతి ఉంది, జీవన విలువలున్నాయి, జీవన నైపుణ్యాలున్నాయి, వ్యక్తిత్వ విశ్లేషణలున్నాయి, వ్యక్తిత్వ నిర్మాణం ఉంది. పద్య నాటకాలు మన తెలుగుకే సొంతం. ఛందోబద్ధమైన పద్యాలు, అవధానాలు ఎంతో ఉత్తమ ప్రక్రియలు. ఖచ్చితంగా ఉత్తమ వ్యక్తిత్వాల నిర్మాణానికి తెలుగు సాహిత్యం దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి.
మమ్మీ, డాడీ సంస్కృతి విస్తరించిన కారణంగా మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీనమవుతోంది. వావి వరుసలు మృగ్యమవుతున్నాయి. ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పుకాదు. ఆంగ్ల భాషా వ్యామోహం తప్పు. ఆ వ్యామోహంలో పడి ఎంతో గొప్పదైన మన మాతృభాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. మన భావి తరాలు ” మా తాత ముత్తాతలు తెలుగనే భాషలో మాట్లాడుకునే వారట” అని ఏ పరాయి భాషలోనో చెప్పుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈతరం మేలుకోవాలి. మాతృ భాషకు పట్టం కట్టాలి. తెలుగు భాషను బ్రతికించుకోవాలి. మాతృభాషను మరిస్తే అమ్మను మరచినట్లే. మాతృభాషను కాపాడుకుంటే అమ్మను కాపాడుకున్నట్టు, అమ్మతనాన్ని కాపాడుకున్నట్టు.





