
ఆగస్టు 15వ తేదీ ఉదయం… విజయవాడ గుణదల రోడ్ లో ఓ వేరుశనక్కాయల గుట్ట మీద జాతీయ జెండా సగర్వంగా ఎగురుతూ కనిపించింది. ప్రక్కనే ఆ శనక్కాయలమ్మే పెద్దమ్మ. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆగి “ఈ జెండా ఎందుకెగరేశావ్ పెద్దమ్మా?” అనడిగాడు. “ఇదేకద బాబూ మన ఊపిరి?” అందామె సింపుల్ గా. గొప్ప భావమున్న చిన్న సమాధానం. ఆ పెద్దావిడ చూపిన విజ్ఞతకతను ముగ్ధుడైపోయాడతను.
గోదావరి జిల్లాలలో ఓ చోట. వయో వృద్ధ దంపతులు. ఆగస్టు 15న జెండా కట్టాలి. పెద్దావిడ ఓ స్టూల్ మీదకు ఎక్కి జెండా కడుతుంటే… పెద్దాయన ఆ స్టూల్ అటూఇటూ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. ఈ ఫోటో ఎందరిలోనో ప్రేరణ కలిగించింది. అక్కడ ఇక్కడ అనేమి… ఇళ్లకు, దుకాణాలకు, కరెంట్ స్తంభాలకు, లారీలకు, కార్లకు, బైకులకు, సైకిల్ రిక్షాలకు, కూరగాయలు అమ్మే బండ్లకు, సైకిళ్లకు ప్రతి చోటా తిరంగా సగర్వంగా రెపరెపలాడింది. ప్రతి ఒక్కరి కళ్ళలో ఒక అపూర్వమైన వెలుగు. అనిర్వచనీయమైన గర్వంతో కూడిన చిరునవ్వు. తెలుగు రాష్ట్రాలలో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అడుగడుగునా జాతీయ జెండా రెపరెపలు కనిపించాయి. పిన్నలు, పెద్దలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు అందరూ పెద్ద ఎత్తున అమృతోత్సవ వేడుకలలో భాగస్వాములవటం ఓ గొప్ప శుభపరిణామం.
ప్రధాని, ఇంటింటా తిరంగా ఎగరేయమని పిలుపునివ్వగానే కొంతమంది యథాప్రకారం తమ ఏడుపులను మొదలు పెట్టారు. “దేశంలో జీఎస్టీ పెరిగింది, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇంటింటా జెండా ఎగరేస్తే ఇవన్నీ తగ్గిపోతాయా? జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్టా?” అంటూ ప్రశ్నలు సంధించారు. కానీ సామాన్యులెవరూ వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. రెట్టించిన ఉత్సాహంతో జెండాలు ఎగరేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుని ఉప్పొంగిపోయారు. ఎందుకంటే దేశం సాధిస్తున్న అపూర్వ విజయాలతో వారు అద్భుతమైన ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు. క్రీడలలో, సాంకేతికంగా, ఆర్థికంగా, ఆయుధ సంపత్తిలో, సైనిక శక్తిలో దేశం సాధిస్తున్న పురోగతిని చూసి దేశ ప్రజలు పులకిస్తున్నారు. ఆ విజయాలలో, ప్రగతిలో తాదాత్మ్యం చెందుతున్నారు. గర్విస్తున్నారు. అందుకే కొందరు తిరోగమన వాదుల అడ్డగోలు అభ్యంతరాలను తోసిరాజని వారికి సబబుగా, న్యాయంగా తోచిన దానిని నిర్భయంగా, నిర్మొహమాటంగా చేసి చూపుతున్నారు. ఒకప్పుడు జీతభత్యాలు, అధికధరలు వంటి వయక్తిక సమస్యలపై పోరాటానికి వీధులకెక్కుతుండిన ప్రజలు ఇప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం, తమ జాతీయ స్ఫూర్తిని చాటడానికి ఇలా తరచుగా చేతులు కలపడం, సమైక్యంగా స్పందించటం మన దేశ ప్రజల దృష్టికోణంలో వచ్చిన స్పష్టమైన మార్పుకు ప్రబల తార్కాణం.
భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ ఇజ్రాయిల్… తమ దేశంలోని ఒక అధికారిక భవనంపై తమ జాతి పతాకతో సమానంగా మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత్ పట్ల తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకుంది. ఆస్ట్రేలియాలో భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
మనదేశంలో శ్రీ రవిశంకర్ గురూజీ, మాతా అమృతానందమయి, గణపతి సచ్చిదానంద స్వామి, రాందేవ్ బాబా, సద్గురు జగ్గీ వాసుదేవ్ తదితరుల ఆధ్వర్యంలో వారి భక్తకోటి నడుమ భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు నభూతో న భవిష్యతి అన్న రీతిలో జరిగాయి. ఇక తిరుమల, చిదంబరం, తెలంగాణ ముచ్చింతల్ లో కొలువై యున్న సమతామూర్తి భగవద్రామానుజుల సన్నిధి వంటి అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థ క్షేత్రాలలో సైతం త్రివర్ణ శోభ సంతరించుకుంది.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పిలుపుతో లక్షలాదిమంది దేశభక్తులు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉదయం 6:30 గంటలకు ఇంటింటా పూర్తి వందేమాతర గీతాన్ని భక్తిప్రపత్తులతో, ఉప్పొంగిన హృదయాలతో ఆలపించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో 16,000 మంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఏకకాలంలో ముక్తకంఠంతో ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. రాజస్థాన్ లోని వివిధ పట్టణాలలో ఏకకాలంలో లక్ష మందికి పైగా జాతీయ గీతాన్ని ఆలపించారు.
అన్నిటికంటే ముఖ్యంగా భారత జాతీయ జెండా అనేక అవమానాలకు గురైన జమ్మూకాశ్మీర్లోని పాఠశాలలు, కూడళ్ళు, దుకాణ సముదాయాలు, గృహ సముదాయాలలో తిరంగా ఘనంగా ఎగిరింది. ఒకప్పుడు తిరంగా ఎగరేయడం సవాలుగా మారిన లాల్ చౌక్ లో నేడు తిరంగా గర్వంగా ఎగిరింది. భారత పాలకుల దృష్టికోణంలో, తీరులో, వ్యవహార శైలిలో, భారత ప్రజల ఆలోచనా సరళిలో, జాతీయ దృష్టికోణంలో, దేశభక్తి ప్రకటనలో వచ్చిన విలక్షణమైన మార్పుకు ఈ స్వాతంత్ర్య అమృతోత్సవాలు ప్రబల సాక్ష్యంగా నిలిచాయి, భారత జాతి చరిత్రలో నిలిచిపోతాయి. స్వాతంత్ర్య అమృతోత్సవాలలో మన ప్రధాని శ్రీ నరేంద్రమోడీ అభిలషించినట్లుగా…. భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి మన మాతృభూమిని విశ్వ గురువుగా నిలుపుదామని మనమందరం ఈ సందర్భంగా సంకల్పం చేద్దాం. కటి బద్ధులమై ఆ సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి అహరహమూ కృషి చేద్దాం. భారత్ మాతాకీ జై.