
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు’ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ పురోగతి విషయాలను రాయ్.. వార్తాసంస్థ పీటీఐతో పంచుకున్నారు. డిసెంబర్ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.
★ మందిరం చుట్టూ రోడ్లను మరింత మెరుగుపరచడంలో భాగంగా నిర్మాణాలు, కూల్చివేతలు సైతం శరవేగంగా సాగుతున్నట్లు రాయ్ తెలిపారు. 1000 ఏళ్లు నిలబడేలా ఆలయ పునాదులను పటిష్ఠంగా నిర్మించినట్లు వెల్లడించారు.
★ రోజువారీ పనుల పురోగతి పర్యవేక్షణలో భాగంగా రాయ్ ఎప్పటికప్పుడు సంబంధిత విభాగాల ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్మాణానికి కావాల్సిన నిధులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు.
★ గర్భగుడి లోపల రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుంచి తెప్పించిన తెల్లటి మార్బుల్ ను వినియోగించనున్నట్లు రాయ్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మార్బుల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పూర్తయిన వాటిని అయోధ్యకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నామన్నారు.
★ ప్రాకారాలకు 8-9 లక్షల ఘనపు అడుగుల చెక్కిన ఇసుకరాయిని; అడుగు భాగానికి 6.37 లక్షల ఘనపు అడుగుల గ్రానైట్ ను; ప్రధాన ఆలయానికి 4.7 లక్షల ఘనపు అడుగుల గులాబిరంగు ఇసుకరాయిని; గర్భగుడికి 13,300 ఘనపు అడుగుల మక్రానా తెల్లటి మార్బుల్ ను; అడుగు, అంచులకు 95,300 చదరపు అడుగుల మక్రానా తెల్లటి మార్బుల్ ను వినియోగిస్తున్నట్లు రాయ్ తెలిపారు.
★ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరానికి వస్తున్న వారంతా ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తున్న వేలాది రాళ్లను ఉంచిన స్థలాన్ని సందర్శించాలని చంపత్ రాయ్ కోరారు.





