News

హైదరాబాద్‌లో ఫారూఖీ కామెడీ షో… రాజాసింగ్ అరెస్ట్

444views

భాగ్య‌న‌గ‌రం: వివాదాస్ప‌ద స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ కామెడీ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో వివాదం చెలరేగుతున్నది. శ‌నివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు శిల్ప‌క‌ళా వేదిక‌లో మునావార్ షో జ‌ర‌గ‌నుంది. ఈ స్టాండప్ కామెడీ షో పై బీజేపీ, ఇతర హిందూ సంస్థలు మొదటి నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇప్పటికే మునావర్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేను ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీసులు భారీగా మోహరించారు. ఆయననులాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హిందూ దేవతలను అవమానిస్తూ గతంలో వ్యాఖ్యలు చేసిన ఇలాంటి వ్యక్తికి అనుమతి ఇవ్వడం పట్ల బీజేపీ హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

పోలీసులు అనుమతి ఇవ్వవద్దని రాజాసింగ్ కోరినా మునావర్‌ను హైదరాబాద్‌కు మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. మునావర్ ఫారూఖీ గత జనవరిలోనే హైదరాబాద్‌లో షో నిర్వహణకు ముందుకు రాగా, మంత్రి కేటీఆర్ ఆయనకు సోషల్‌మీడియా వేదికగా స్వాగతం పలికారు. దీంతో అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేపీ నేతలు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్‌లు.. హిందూ సమాజాన్ని కామెడీ చేసే వాళ్ళ‌కి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వెనక్కి తగ్గని కేటీఆర్ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని, మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పట్లో కరోనా కారణంగా వల్ల మునావర్ షో రద్దు కావడంతో వివాదానికి తెరపడింది.

ఇప్పుడు వస్తుండడంతో కామెడీ షోకు పోలీసులు అనుమతినిచ్చారు. మతంతో సంబంధం లేదని.. కామెడీ షోకు అనుమతిచ్చామని పోలీసులు చెబుతున్నారు. తాము వ్యతిరేకిస్తున్న మునావర్‌ను కేటీఆర్ ఆహ్వానించడం, హైదరాబాద్ లో షో చేస్తుండడంపై బీజేపీ భగ్గుమంది. హిందువులను కించపరిచే వ్యక్తి కార్యక్రమానికి ఎలా అనుమతిచ్చారంటూ మంత్రి కేటీఆర్‌ను రాజాసింగ్ ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీసులే బాధ్యత అని ఆయన హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి