ArticlesNews

మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన రియల్ హీరోలు-

3views

మూగజీవాల బాధను అర్థం చేసుకోవడం, వాటికి చేయూత అందించడం కంటే గొప్ప మానవత్వం మరొకటి ఉండదు. ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇదే సూత్రాన్ని తమ జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. ఒకరు ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించినా తన సేవకు వీడ్కోలు పలకని ప్రభుత్వ మాజీ వెటర్నరీ డాక్టర్ (పశువైద్యుడు) నిరంజన్ సాహు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక చాలా మంది ప్రశాంతమైన జీవితం కోరుకుంటారు. కానీ సాహు మాత్రం తన బాధ్యతల్ని అక్కడితో ముగించలేదు. ఇక మరొకరు మూగజీవుల సేవే తన జీవితంగా భావించిన వాలంటర్ దుర్గా ప్రసాద్ పాధి. ఈయన పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తాన్ని జంతువుల సేవకే అంకితం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో ఏళ్లుగా అనాథ మూగజీవాల్ని రక్షించి వాటికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.

డాక్టర్ నిరంజన్ సాహు దాదాపు 45 ఏళ్లుగా జంతువులకు చికిత్స అందిస్తున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత 1982 ఆగస్ట్ 23న జూనియర్ వెటర్నరీ డాక్టర్‌గా ప్రభుత్వ సేవల్లో చేరారు. ఒడిశాలో పలు జిల్లాల్లో సుదీర్ఘ కాలం సేవలందించి, 2018లో సబ్ డివిజనల్ వెటర్నరీ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. వెటర్నరీ విభాగంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆయనకు జంతువుల కదలికలు, చూపుల్ని బట్టే వాటి ఆరోగ్య సమస్యలను పసిగట్టడం వెన్నతో పెట్టిన విద్య.

‘జంతువులు మాట్లాడలేవు. వాటి శరీర కదలికలు, ముఖ కవళికలు, ప్రవర్తన ద్వారా మాత్రమే మనం వాటి సమస్యల్ని గ్రహించాలి. పశువైద్యం అంటే ఇది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు. ఇది ప్రేమానుబంధాలతో ముడిపడి ఉంటుంది. ఉదయం జంతువులను పట్టించుకోకుండా రోజు ప్రారంభిస్తే నాకు ఆ రోజు సరిగా సాగదు’ అని డాక్టర్ సాహు చెబుతున్నారు. జంతువుల సమస్యల్ని గుర్తించడానికి ఎన్ని పరికరాలు వచ్చినా, జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకునే వైద్యుడి సామర్థ్యాన్ని అవి భర్తీ చేయలేవని అంటున్నారు. కుటుంబ సభ్యులు, భార్య, తమ ఇద్దరు పిల్లలు అందించిన పూర్తి సహకారంతోనే తాను ఇప్పటికీ ఈ సేవల్లో కొనసాగగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. వారి మద్దతు లేకుంటే ఈ ప్రయాణంలో తాను ఇంత దూరం వచ్చే వాడిని కాదని చెబుతున్నారు.

1999 విపత్తు తెచ్చిన మార్పుతో దుర్గా ప్రసాద్!
ఇక గంజాం జిల్లా బుగుడాకు చెందిన దుర్గా ప్రసాద్ పాధిది మరో కథ. ఈయనకు చిన్నప్పటి నుంచి పక్షులు, పశువులు అంటే ఇష్టం. 1999లో సంభవించిన సూపర్ సైక్లోన్ ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ విపత్తు సమయంలో గాయపడిన, ఆకలితో ఉన్న పశువులు, ఇతర మూగజీవులను కాపాడేందుకు వాలంటీర్‌గా రంగంలోకి దిగారు. అప్పటి నుంచి ఆ సేవను వదల్లేదు. గాయపడిన జంతువులను రక్షించి, వాటికి ఆహారం అందించే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి సుమారు 27 సంవత్సరాలుగా ఈ సేవల్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇక దుర్గా ప్రసాద్ ఒకవైపు మూగజీవుల రక్షణ కోసం తన జీవితాన్ని కేటాయిస్తూనే, జీవనోపాధి కోసం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. దీని ద్వారా వచ్చే సంపాదనలో పెద్ద మొత్తం అనాథ జంతువుల ఆహారం, వైద్య సేవలకే వెచ్చిస్తున్నారు. జంతువులకు సేవ, వాటిని రక్షించడానికి పూర్తి సమయం కేటాయించడానికే పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన చెబుతున్నారు. ‘జంతువులు భయం, నొప్పితో ఉన్నప్పుడే దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ వాస్తవానికి అవి మనుషుల నుంచి ప్రేమను మాత్రమే కోరుకుంటాయి’ అని దుర్గా ప్రసాద్ చెప్పుకొచ్చారు.

‘పీపుల్ ఫర్ యానిమల్స్’ కేంద్రంగా పునరావాసం
భువనేశ్వర్‌లో 1999 నుంచి పనిచేస్తున్న పీపుల్ ఫర్ యానిమల్స్‌ (PFA) అనే సంస్థలో డాక్టర్ సాహు, దుర్గా ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ, యజమానులు వదిలేసిన ఆవులు, కుక్కలు, పిల్లులకు ఈ కేంద్రం ఆశ్రయం కల్పిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 400 కంటే ఎక్కువ పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, ఉచితంగా నిత్యం వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ సాహు జంతువుల సమస్యల్ని పరిశీలించి వైద్య చికిత్స అందిస్తుండగా, దుర్గా ప్రసాద్ షెల్టర్ నిర్వహణ సహా ఆహారం, మందులు, ఇతర బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇలా మనుషుల నిర్లక్ష్యం, స్వార్థం వల్ల వీధిన పడుతున్న మూగజీవులకు ఈ ఇద్దరూ తమ సమయం, ఆర్థిక వనరుల్ని ధారపోస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.