
వీరబ్రహ్మం గారి జనన కాలం, తల్లిదండ్రుల వివరాలు స్పష్టంగా తెలియవు. నంది కొండ మఠాధిపతి వీరభోజయాచార్యులు, వీర పాపాంబలు వీరిని పెంచి పెద్దచేశారు. హఠ, రాజ, స్వర, మంత్ర, లయ- వంటి వివిధ యోగ మార్గములలో మహా యోగం సాధించిన శ్రీ పోతులూరి వీరమ్రహ్మేంద్ర స్వామి వారు ‘కాలజ్ఞానం’ వ్రాశారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయని నమ్ముతారు.
వీరబ్రహ్మంగారు జన్మించేనాటికి ఆంధ్రదేశం హిందూ ముస్లిం కలహాలతో, హిందువుల్లోని ఉచ్ఛనీచ భావాలతో, మూఢాచారాలతో కూరుకుపోయింది. వీర బ్రహ్మంగారు కులాలు మానవ కల్పితాలనీ, పరమేశ్వరుని దృష్టిలో అందరూ సమానులేననీ, జ్ఞాని ఏ మతం వాడైనా, ఏకులం వాడైనా పూజ్యుడనీ తన బోధనల ద్వారా, రచనల ద్వారా, తన ఆచరణ ద్వారా చూపించారు. వెనుకబడిన వర్గాల ప్రజలలో ఆధ్మాత్మికోన్నతిని కల్గించారు.
బ్రహ్మం గారి పదవ ఏట ఆయనను పెంచిన తండ్రి వీరభోజయాచార్యులు స్వర్గస్తులయ్యారు. అటు పిమ్మట బ్రహ్మంగారు దేశాటన నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరాడు. అందుకు, వారి తల్లి, నాయనా వీరంభొట్లయ్యా! (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభొట్లయ్యగా పిలువబడ్డారు. పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి.) మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోయింది. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా, ఆమెను అనేక విధాలుగా అనునయించి ఆమెకు జ్ఞానభోద చేశాడు వీరంభొట్లయ్య. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి…. అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు. శరీరం పాంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా ‘నేను’ అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.
ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు వచ్చేటప్పటికి 15 యేండ్లు కూడా లేని పసివాడు. ఆ బాలుడు పశువులు కాస్తాడని, పశువైద్యము తెలుసని ఊరి వారి ద్వారా తెలుసుకున్న గరిమిరెడ్డి అచ్చమ్మ అనే సంపన్నురాలు బ్రహ్మం గారిని తమ పశువులకాపరిగా నియమించుకుంది.
అచ్చమ్మ ఇచ్చిన సంగటిముద్దను తీసుకొని వీరబ్రహ్మం గోవులను తోలుకుని రవ్వలకొండకు పొయ్యాడు. ఆలమందనొకచోట జేర్చి ఒక గీతను గీశాడు. గోవులాగీతను దాటకుండా ఆ గిరి లోపలే మేత మేస్తూ ఉండేవి. అక్కడే గులజారముల్లుతో తాటిఆకుపై కాలజ్ఞానం వ్రాయటం ప్రారంభించాడు బ్రహ్మయ్య. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూసి భయపడి పరుగు పరుగున అచ్చమ్మకు ఈ విషయాన్ని చేరవేశారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన చేస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోయింది అచ్చమ్మ. తనకు జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్ధించింది. అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉంది.
బ్రహ్మంగారు అచ్చమాంబకు, ఆమె భర్తకు యాగంటి కొండశిఖరంమీద కాలజ్ఞానమునుపదేశించారు. ఇతర భక్తులు కూడా వారిని అనుసరించి ఆ ఉపదేశాన్ని(ముచ్చట్లు) వినేవారు. అందుకే యాగంటి సమీప పర్వత ప్రాంతానికి ’ముచ్చట్ల కొండ’ అనే పేరొచ్చింది.
అచ్చమాంబ బ్రహ్మంగారు తపస్సుచేసుకోటానికి తన గృహప్రాంగణంలో నేలమఠం నిర్మించింది. ఈ మఠంలో బ్రహ్మంగారి తపస్సు నిరాటంకంగా జరిగిపోయింది. ఇక్కడే ప్రుట్టు గుడ్డి వాడైన అచ్చమాంబ కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించారు బ్రహ్మం గారు. బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలోనే బ్రహ్మంగారు తనచే వ్రాయబడిన 14000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచారు.
బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ
బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడో కాదో స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు. ఆయన మహిమను కళ్ళారా చూసిన నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి, దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి, ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపాడు.
కందిమల్లయపల్లె, పెద్దకొమెర్లలలో జీవితం
ఆపై ఆయనకు దేశాటన చేయాలనే కోరిక కలగటంతో శిష్యులకు నచ్చజెప్పి దేశాటనకు బయలుదేరాడు. పర్యటిస్తూ కందిమల్లయపల్లెకు చేరుకున్నాడు. ఆ ఊరు ఆయనను ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరుచుకుని మామూలు వడ్రంగిలా జీవించడం ప్రారంభించాడు.
గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు కోరగా తాను పేదవాడినని, ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు. వారు ఆయనను చులకనచేసి మాట్లాడడంతో “సరే ఇస్తాను. కానీ అమ్మవారి గుడిదగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలి” అని కోరాడు. అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరకు అందరూ చేరారు. గుడి దగ్గర అందరి ముందూ నిలబడి గ్రామ మునసబు చుట్టకాల్చుకోవటానికి అమ్మవారిని ఉద్దేశించి ‘పోలేరీ చుట్టకు నిప్పు పట్టుకునిరా ‘ అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు ఆయనకు నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది ఆయనను గౌరవించడం మొదలుపెట్టారు. నాటి నుంచి ఆయన వారికి ధర్మబోధ చేయడం మొదలు పెట్టారు. ఇలా ఆయన గురించి చుట్టూ ఉండే గ్రామాలకు కూడా తెలియడంతో చుట్టుప్రక్కలి గ్రామాల వారు కూడా ఆయన కోసం తరలి రావడం మొదలుపెట్టారు.
వివాహం
కొద్దిరోజులకు కందిమల్లయపల్లె నుంచి పెద్దకొమెర్ల వచ్చి అక్కడ వడ్రంగి పని చేసుకుంటూ సామాన్య జీవనం గడపసాగాడు. అక్కడ కూడా వివిధ సందర్భాలలో తన మహిమలు చూపడంతో గ్రామస్తులకు ఆయనపై భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. వారు కూడా ఆయన చుట్టూ మూగి ఆయన ధార్మిక బోధలు వినేవారు. ఆ ఊరిలోని శివకోటయ్యాచార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరువాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు. అందుకు బ్రహ్మంగారు కూడా అంగీకారం తెలపారు. బాల్యవివాహాలు ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లో బ్రహ్మంగారు వివాహానికి తగిన వయస్సు ఉన్న గోవిందమ్మను వివాహం చేసుకోవడం విశేషం. వివాహానంతరం కొంతకాలం ఆయన భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. ఆ దంపతులకు ఆరుగురు సంతానం కలిగారు.
సిద్దయ్య శిష్యరికం
బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించారు. స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చారు. అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నారు. అతని ఉన్నత భావాలను, భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రియశిష్యుని చేసుకుని ఆయనకు అనేక ఉన్నత భోదలు చేశారు. అతను జ్ఞానం లభించినవాడని ప్రశంసించి జ్ఞానం సిద్దించింది కనుక అతనికి సిద్దయ్యగా నామకరణం చేశారు బ్రహ్మంగారు.”సిద్ధా” అనే మకుటంతో కొన్ని పద్యాలను ఆశువుగా చెప్పారు.
సిద్దయ్య ధ్యానం చేస్తూ తన దగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు, రుద్రాక్షలు, తిలకధారణ చేయిస్తూ వచ్చాడు. ఇది తెలిసి ఆగ్రహించిన కడప నవాబుకు తన మహిమను చూపి శాంతపరచాడు.
కక్కయ్యను శిష్యునిగా….
బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య, కుండలినీశక్తి, శరీరంలోని యోగచక్రాల గురించి వివరిస్తూ శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలుంటారని, కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు కక్కయ్య. ఇంట్లో అతని భార్య నిద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికేశాడు. అయినా ఆమె శరీరంలో రక్తమాంసాలు తప్ప ఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు. బ్రహ్మంగారి మాటలు నమ్మి భార్యను నరికేశానని, బ్రహ్మంగారే దీనికంతా కారణమని, ఆయన దొంగ అని అందరికీ చెప్పాలనుకున్నాడు. ముందుగా ఆయన దగ్గరకు వెళ్ళి అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి ఆయనను దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే ‘కక్కా నేను చెప్పింది అసత్యం కాదు. నేను అసత్యం పలకను. నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను ‘ అని చెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది. కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని తనను మన్నించమని పలు విధాల వేడుకుని తనను శిష్యుడిగా చేర్చుకొనమని, తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు. బ్రహ్మంగారు ఎవరూ ‘నన్ను పూజించవద్దు. నాశిష్యులెవరూ నన్ను పూజించరు. దేవుడిని అన్వేషిస్తారు అదే అందరికి ఆమోదయోగ్యము. నువ్వు కూడా అదే పని చెయ్యి’ అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు.
హైదరాబాదు పర్యటన
గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని, ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళారు. ముందుగా నవాబు ఆయనతో “మీరు జ్ఞాని అయ్యుండొచ్చు కానీ దైవాంశ సంభూతుడంటే మాత్రం నమ్మలేను, ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలను” అని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించి, ఆ నీటితో దీపం వెలిగించారు. అది చూసిన నవాబు తనకు విశ్వాసం కుదిరిందని, జ్ఞానబోధ చేయమని కోరాడు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేశారు.
పుష్పగిరి బ్రాహ్మణులకు జ్ఞానోపదేశం
వీరబ్రహ్మంగారు కడపజిల్లా పుష్పగిరి అగ్రహారం గుండా తన శిష్యులతో వేదము, వేదాంతంపై చర్చిస్తూ వెళుతుండగా అగ్రహారంలోని బ్రాహ్మణులు, వీరందరూ తక్కువ కులంవారనే భావంతో వీరిని అడ్డగించారు. స్వామి పుష్పగిరి బ్రాహ్మణులకు వర్ణవ్యవస్థ, దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పి వేదాధ్యయానికి సర్వకులాల వారికీ అధికారం ఉందని నిరూపించారు.
సమాధి
బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబసభ్యులను, శిష్యులను సమావేశపరచి తాను కొద్దిరోజులలో సమాధిలో ప్రవేశించబోతున్నట్లు, తన తరువాత, తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. సిద్దయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సా.శ.1693లో సజీవ సమాధి పొందారు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించసాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చారు. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణంను బోధించారు. ఆ తరువాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వల్ల ప్రసిధ్ది పొందడంతో తర్వాతి కాలంలో కందిమల్లాయపల్లె ‘బ్రహ్మంగారిమఠం’ గా ప్రసిద్ధి చెందింది.
ఉపసంహారం
‘అన్నాజయ్య’ అనే బ్రాహ్మణుడు, ‘సిద్ధయ్య’ వంటి మహమ్మదీయుడు, ‘కక్కయ్య’ వంటి మాదిగ బహ్మంగారి ప్రియ శిష్యులు, ఉత్తమ సాధకులు. ఆ విధంగా తన చర్యలతో సమాజంలో సమతా, సమరసతా భావన నిర్మాణం చెయ్యడానికి బ్రహ్మంగారు విశేష కృషి సల్పారు. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి ప్రభావం ముఖ్యంగా తెలుగు నేలపై, వెనుక బడిన పేదవర్గాల ప్రజలపై ఇప్పటికీ ఎంతో ఉంది. మహిళల పట్ల వివక్ష కూడదనీ ఆధ్మాత్మికోన్నతికి మహిళలూ అర్హులేనని నిరూపించడానికి తన కూతురిని యోగినిని చేశారు.
దూదేకుల కులంగా పిలువబడే ముస్లింలు ఎక్కువ మంది వీరి భక్తులయ్యారు. అటు బనగానపల్లె, ఇటు కడప, అటు హైదరాబాదు నవాబుల పాలనలో మ్రగ్గిపోతున్న రాయలసీమ, తెలంగాణా హిందువులను రక్షించడానికి, విధర్మీయుల పాలనలో కునారిల్లిపోతున్న హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతరించారనిపిస్తుంది. ఆయన, సిద్ధయ్యల మహిమల, బోధనల ప్రభావంతో అప్పటికే మతం మార్చబడినవారు తిరిగి స్వధర్మాన్ని స్వీకరించారు. క్రొత్తవారు మతం మారకుండా వారు కాపాడగలిగారు. అమాయక హిందువులను వేధిస్తూ బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతూ ఉండిన విధర్మీయ పాలకుల దౌర్జన్యాలకు తమ మహిమల ప్రదర్శనతో అడ్డుకట్టవెయ్యగలిగారు. తమ ధార్మిక బోధనలతో హిందూ సమాజంలో ధార్మిక చైతన్యాన్ని కలిగించారు. హిందూ సమాజంలోని మూఢాచారాలను, సామజిక రుగ్మతలను నిర్మూలించగలిగారు. విపత్తులో మునిగిన హిందూ సమాజాన్ని రక్షించడానికి ఆ విధాత సృష్టించిన హిందూ ధర్మ రక్షా కవచం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. సాధనతో భవిష్యత్తును దర్శించిన ద్రష్ట. తానున్న కాలంలోనేగాక భావితరాలకు సైతం తగురీతిలో మార్గదర్శనం చేసిన మహానేత, సామాజిక సంస్కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.





