News

సంపూర్ణ స్వయంసేవక్ పారికర్: ఆంధ్ర ప్రాంత సంఘచాలక్.

1.4kviews

ఆరెస్సెస్ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేసి ఎందరో దేశ భక్తులను నిర్మాణం చేసిన నిబద్దత కలిగిన కార్యకర్త శ్రీ మనోహర్ పారికర్ అని ఆరెస్సెస్ ఆంద్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ శ్రీనివాస రాజు అన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తగా అటు వ్యక్తి నిర్మాణ కార్యంలోనూ, సిద్దాంతాలకు కట్టుబడి పని చేసే ప్రజా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ మంత్రిగా ఇలా వివిధ బాధ్యతలలో దేశ నిర్మాణ కార్యంలో ప్రజా క్షేత్రంలో సమర్ధవంతంగా పని చేసిన కార్యకర్త శ్రీ పారికర్ అని శ్రీ శ్రీనివాస రాజు కొనియాడారు.

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నగోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ (63) ఈరోజు కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.  ఈ రోజు సాయంత్రం పారికర్‌ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, డాక్టర్లు తమ శాయశక్తులా ఆయనకు వైద్యం అందిస్తున్నారని గోవా సీఎంవో ట్వీట్‌ చేసింది.

ప్యాంక్రియాటిక్‌ వ్యాధితో బాధపడుతున్న పారికర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌, గోవా, ముంబైలోనూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో సుదీర్ఘ చికిత్స తీసుకున్నా అయినా ఫలితం లేకపోయింది. కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జనవరి 30న అసెంబ్లీలో పారికర్‌ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

పారిక‌ర్ 1955 డిసెంబర్‌ 13న గోవాలో జ‌న్మించారు. ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ లో శిక్ష‌కుడిగా ప‌ని చేసి బీజేపీలోకి వచ్చిన ఆయన తొలిసారి 1994లో గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్న పారికర్‌ మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా తన చతురతతో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించారు. అయితే, 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు.

పారికర్ ప్రధాని మోదీ కేబినెట్‌లో రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆయ‌న హయాంలోనే ఫ్రాన్స్‌తో రఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం జరిగింది. మరోవైపు పారికర్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్‌ కోవింద్‌తో పాటు, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇక పారికర్‌ మరణంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.