
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హరిద్వార్‌లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్‌లోని తమ ఇళ్ళకు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. భక్తులను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్.. పరారైనట్టు తెలుస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకొంటామని పోలీసులు తెలిపారు.
శివుడి భక్తులు ఏటా కావడ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ భక్తులను కావడియాలుగా పిలుస్తారు. వీరు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బిహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి పవిత్ర ప్రాంతాల నుంచి గంగాజలం ఇంటికి తీసుకెళ్లి.. దేవుడ్ని పూజిస్తారు. కరోనా కారణంగా.. రెండేళ్ళుగా కావడ్ యాత్ర జరగలేదు. ఈసారి కొవిడ్ నిబంధనల నడుమ పునఃప్రారంభమైంది.





