
9 నుంచి 11 నెలల వయస్సు గల శిశువులకు బీఫ్ తినిపించాలని సూచిస్తూ నవీ ముంబై మున్సిపల్ ఆసుపత్రిలో ప్రదర్శించిన పోస్టర్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు విహెచ్‌పి ప్రతినిధులు వాషి పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం సమర్పించారు. అనంతరం కార్యకర్తలు అభ్యంతరకరంగా భావించిన పోస్టర్లను తొలగించారు.
విహెచ్‌పి తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 14న కార్యకర్త రోహిత్ ఖండగలే వాషిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆసుపత్రి గోడపై ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) – ఐవైసిఎఫ్ విభాగం’ పేరుతో ప్రదర్శించిన ఒక మార్గదర్శక పోస్టర్‌ను గమనించారు. ‘9 నుంచి 11 నెలల వయస్సు గల శిశువుల కోసం అనుబంధ ఆహార మార్గదర్శి’ అనే శీర్షికతో ఉన్న ఆ పోస్టర్‌లో చికెన్, మటన్‌తో పాటు బీఫ్‌ను కూడా ఆహార సూచనల జాబితాలో పేర్కొన్నట్లు వారు తెలిపారు.

హిందూ సమాజంలో ఆవును గోమాతగా, పవిత్రమైనదిగా భావిస్తారని, అలాంటి పరిస్థితుల్లో శిశువులకు గోమాంసం తినిపించాలని సూచించడం కోట్లాది హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే చర్యగా విహెచ్‌పి అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశంలో ఇటువంటి సూచనలను ప్రదర్శించడం మతపరమైన మనోభావాలను గాయపరిచే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో పోస్టర్‌ను రూపొందించిన మరియు ప్రదర్శించిన బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత సంస్థలపై కేసు నమోదు చేయాలని విహెచ్‌పి డిమాండ్ చేసింది. అలాగే ఇలాంటి పోస్టర్లను తక్షణమే తొలగించి భవిష్యత్తులో ప్రజల మత విశ్వాసాలను గౌరవించే విధంగా వ్యవహరించాలని అధికారులను కోరింది.