
మధ్యప్రదేశ్‌లోని మధ్యప్రదేశ్ లోని బేతుల్ లో నిర్వహించిన “ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత” కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము, అభివృద్ధికి మరియు సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాల సాధికారత కోసం నిర్వహించిన ఈ సదస్సు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యం కలిగినదని అన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజాలు కీలక పాత్ర పోషించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
గిరిజనుల జీవన విధానం సహజంగానే ప్రకృతితో, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుందని పేర్కొన్న రాష్ట్రపతి, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యపూర్వక జీవనం వంటి విలువలను గిరిజన సంప్రదాయాల నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ మరియు మానవ సంక్షేమం వంటి శాశ్వత విలువలను సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని, 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మరింత నిబద్ధతతో కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక వారసత్వం మరియు గిరిజన సంప్రదాయాల పరిరక్షణ ద్వారానే దేశం సమగ్ర అభివృద్ధి సాధించగలదని ఆమె స్పష్టం చేశారు. “వికాసం–విలువలు రెండూ కలిసినప్పుడే నిజమైన సుసంపన్న సమాజం ఆవిర్భవిస్తుంది” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.





