ArticlesNews

స్వాతంత్య్రోద్యమ తొలినేత లోకమాన్య బాలగంగాధర తిలక్

61views

’స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసి ముందుకు సాగిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు లోకమాన్య బాలగంగాధర తిలక్. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే ఆయన్ను సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా చరిత్రకారులు చెబుతారు.

బాల్యం

బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయన సహజగుణం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.

తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు అతను తండ్రికి రత్నగిరి నుంచి పూణేకి బదిలీ అయింది. అక్కడ ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడాయన. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో అతను గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత కూడా తన చదువును కొనసాగించి L.L.B. పట్టా పొందాడు.

‘కాంగ్రెస్ అంటే అడుక్కునే వాళ్ళ సంఘం’ అన్న తిలక్

తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడిగా చేరారు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మారు. అప్పటివరకూ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను “pray, petition, protest” చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశారు : “మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.” అని. “అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్‌స్టిట్యూషన్)” అన్నారు. కాంగ్రెస్ సమావేశాలను 3-డే తమాషాగా అభివర్ణించారాయన. “స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను.” అని తీర్మానించారు.

విద్యాదాతగా, పాత్రికేయుడిగా, ఉద్యమకారుడిగా….

ఆయన పాశ్చాత్య విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉందని, ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశ్యం ఆయనది. ప్రతి భారతీయుడికీ భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి “దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ”ని స్థాపించారు.

ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు “మరాఠా (ఆంగ్ల పత్రిక)”, “కేసరి (మరాఠీ పత్రిక)” పత్రికలలో… మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశారు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించారు.

జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం మొదలుపెట్టారు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే వ్రాతలు వ్రాశాడనే నెపంతో 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష విధించింది ఆంగ్లేయ ప్రభుత్వం. విడుదలయ్యాక మరళా స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1906లో దేశద్రోహ నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళ ప్రవాసశిక్ష విధించారు. ఆ సమయంలో బర్మాలోని మాండలే జైలులో ఉన్నప్పుడే ఆయన భగవద్గీతపై “గీతారహస్యం” పేరుతో వ్యాఖ్యానం వ్రాశారు. స్వాతంత్ర్య పోరాటంలో తిలక్‌ అనేకమార్లు జైలుకు వెళ్లారు. కానీ ఏ దశలోనూ జైలు గదులు ఆయన స్వరాజ్య నినాదాన్ని, కాంక్షను అడ్డుకోలేకపోయాయి.

1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ ‌ని స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగారు తిలక్. అనీబిసెంటు కూడా అదే సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యమం మధ్యలోనే చల్లబడిపోయింది. అయితే ఆ ఉద్యమం కారణంగానే ఆంగ్లేయ పాలనలో అనేక సంస్కరణలు వచ్చాయి. పాలనలో భారతీయుల భాగాస్వామ్యమూ పెరిగింది. తాను జీవించి ఉన్నప్పుడే కాక మరణించాక సైతం ఎందరో దేశభక్తులకు స్ఫూర్తిగా నిలిచిన బాల గంగాధర తిలక్ 1920 ఆగస్టు 1వ తేదీన అశువులు బాశారు. ఆయన మరణించినప్పుడు మహాత్మ గాంధీ ఆయన్ను’నవభారత నిర్మాత’గా అభివర్ణించారు. తిలక్‌ తర్వాత కూడా ఆయన స్ఫూర్తి యావత్‌ భారతాన్ని స్వాతంత్య్ర ఉద్యమం దిశగా నడిపించింది. నేటికీ మనలో సైతం జాతీయవాద స్ఫూర్తిని నింపుతూనే ఉంది.

స్వాతంత్ర్యం నా జన్మ హక్కని నినదించిన లోకమాన్యుని జయంతి నేడు.

– శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.